- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Special Story: అమెరికా ఎలక్షన్స్ ఎందుకంత భిన్నం.. కీలకంగా మారిన ఏనుగు, గాడిద
ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా అమెరికా (America)పైనే ఉంది. మరికొద్ది రోజుల్లో అక్కడ ఎన్నికలు (Elections) జరుగనుండడంతో ఎవరు అధ్యక్షుడు అవుతారోనని అందరిలో ఓ క్యూరియాసిటీ (Curiosity) నెలకొంది. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతున్నది. డెమొక్రటిక్ (Democratic Party) తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ (Kamala Harris) పోటీలో నిలువగా.. రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరఫున మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య నెక్ టు నెక్ అన్నట్లుగా ఫైట్ నడుస్తున్నది. ఎన్నికలు అనగానే మనదేశంలో జరిగినట్టు ఇంటింటి ప్రచారాలు, రోడ్లపై ర్యాలీలు, భారీ బహిరంగ సభలు అమెరికాలోనూ ఉంటాయేమోనని చాలామంది అనుకుంటారు. కానీ, అవేమీ ఉండవు. భారత ఎన్నికల వ్యవస్థతో పోల్చతే అమెరికా అధ్యక్ష ఎన్నికల స్వరూపం పూర్తిగా భిన్నమైనది. మరి అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అగ్రదేశం కావడంతో అక్కడ ఎవరు ఓటు వేసేందుకు అర్హులు? ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? సెనెట్ ఎలా కొలువుదీరుతుంది? ఇలాంటి అనేక అంశాలు సహా మొత్తం అమెరికా ఎన్నికల ప్రాసెస్ ఎలా ఉంటుందన్నది ఒకసారి చూద్దాం.. - శ్రీనివాస్ బొల్లబత్తిని
ఎన్నికల షెడ్యూల్ ముందే ఫిక్స్..
ప్రపంచంలో ప్రధానంగా అధ్యక్ష తరహా, పార్లమెంటరీ, స్విస్ సిస్టమ్, కమ్యూనిజం పాలనా వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో అమెరికన్లు అధ్యక్ష పాలనను ఎంచుకున్నారు. ఫలితంగా అధ్యక్షుడే అక్కడ సర్వాధికారి. ఆయన నిర్ణయానికి తిరుగుండదు. ఎవర్నీ అడగకుండానే నిర్ణయం తీసుకోగలిగే సూపర్ పవర్స్ ఉంటాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు చేసే ప్రతి ప్రకటనా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. మరి అంతటి శక్తిమంతుడైన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నిర్వహించే ప్రక్రియ కూడా అత్యంత పకడ్బందీగా ఉంటుంది. అక్కడ ఏ సంవత్సరంలో ఎన్నికలు జరగాలి..? ఏ రోజు ఎన్నికలు నిర్వహించాలి..? ఎప్పుడు ఫలితాలను ప్రకటించాలి..? ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాలి..? వంటివి అన్నీ ముందే ఫిక్స్ చేస్తారు. 244 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య విధానాన్ని గ్రహిస్తే ఇది స్పష్టమవుతుంది. మనదేశంలో అయితే 2024లో ఎన్నికలు జరగాలని ముందే ఫిక్స్ చేయరు. ఎప్పుడు జరుగుతాయో కూడా అంచనా వేయలేం. అమెరికాలో మాత్రం టైమ్ అంటే టైమ్.. 2024లో ఎన్నికలు జరగాలంటే.. ఆ ప్రకారం నిర్వహిస్తారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఎలాంటి ఆటంకమూ ఏర్పడలేదు. ఇక్కడ ఏడాది పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయి.. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే.. మన దేశంలో లాగా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారిదే గెలుపు అన్నట్లుగా అక్కడ ఉండదు. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ సదరు అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేదు. 2016లో డోనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ ఆమె ఓడిపోయారు. 50 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు పోటీ పడతారు. ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజ్(Electoral College) ఓట్లు ఉంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో కనీసం 270 లేదా అంతకుమించి సాధించినవారు విజేతలవుతారు. ఇక్కడ కూడా 18 ఏళ్లు నిండిన వారు ఓటు వేసేందుకు అర్హులవుతారు.
అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు..?
అమెరికా ప్రజలు డైరెక్టుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. వారు ఎలక్టోరల్ కాలేజీని మాత్రమే ఎన్నుకుంటారు. అమెరికా కాంగ్రెస్ (US Congress)లో ఎంత మంది సభ్యులుంటారో.. అంతే మంది ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. ఇక్కడ అమెరికా కాంగ్రెస్ అంటే.. అక్కడి పార్లమెంట్ (Parliament) అని అర్థం. ఇందులో రెండు సభలుంటాయి. ఒకటి సెనెట్ (Senate) రెండోది ప్రతినిధుల సభ (House of Representatives). సెనెట్ అనేది ఎగువ సభ. ప్రతినిధుల సభ అనేది దిగువ సభ. ఇండియా (India)లో రాజ్యసభ సభ్యుల (Members of the Rajya Sabha) ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. కానీ.. అమెరికాలో మాత్రం డైరెక్టుగానే ఎన్నుకొని ఎగువ సభ సెనెట్‌కి పంపిస్తారు. ఇక దిగువ సభలో 435 ప్లస్, మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఆ ముగ్గురూ వాషింగ్టన్ డీసీ(Washington DC)కి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతినిధుల సభకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. అధ్యక్ష ఎన్నికలతో కలిపి ఒకసారి, రెండేళ్లు పూర్తయ్యాక మరోసారి నిర్వహిస్తారు. ఈ సభలో 435 సభ్యుల సంఖ్య ఉండగా.. ప్రస్తుతం డెమొక్రాట్ల ఆధిక్యంలో ఉంది. 100 స్థానాలున్న సెనేట్‌లో దాదాపు 35 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు. సెనేట్ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు.
రెండు పార్టీలదే ఆధిపత్యం
మన దగ్గరికి వచ్చే సరికి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాయి. కానీ.. అమెరికాకు వచ్చేసరికి రెండే పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తుంటాయి. అవే డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు. ఈ రెండు పార్టీల చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి.
ప్రజలదే నిర్ణయాధికారం..
మన ఇండియాలో ప్రధాన అభ్యర్థిని పార్టీలు డిసైడ్ చేస్తాయి. గెలుపు తర్వాత మిత్రపక్షాలతో కలిసి ప్రధానిని ఎన్నుకుంటాయి. కానీ.. అమెరికాకు వచ్చేసరికి ప్రెసిడెంట్ (President)ను అక్కడి ప్రజలే నిర్ణయిస్తారు. ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులను ప్రజలే ఎంపిక చేస్తారు. రెండు పార్టీల నుంచి అధ్యక్ష అభ్యర్థులమంటూ ప్రచారాలు చేసుకున్నప్పటికీ.. చివరికి ప్రజలు డిసైడ్ చేసిన వారే అధ్యక్ష రేసులో ఉంటారు. పార్టీ సభ్యులు కూడా తమ పార్టీ తరఫున ఏ అభ్యర్థి ఉండాలో నిర్ణయిస్తారు. ఈ విధానాన్ని ప్రెసిడెన్షియల్ ప్రైమరీస్ అని అంటారు. ఈ ప్రక్రియ ఇక్కడ 1970 నుంచి ప్రారంభమైంది. ఈ విధానాన్ని 34 రాష్ట్రాల్లో అమలు చేస్తారు. మిగితా 16 రాష్ట్రాల్లో మాత్రం కోకస్ సిస్టం (Caucus system) ఉంటుంది. కోకస్ విధానంలో ప్రముఖ నేతలు అధ్యక్ష అభ్యర్థిని డిసైడ్ చేస్తారు. ఇందుకోసం ఓ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ కొన్ని సూచనలు చేస్తుంది. ఈ సూచనల్ని కొన్ని పార్టీలు పాటిస్తాయి. కొన్ని వ్యతిరేకిస్తాయి. ఈ కమిషన్‌కి రాజ్యాంగ బద్ధత లేదు. ప్రతీ పార్టీలోనూ ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీకి వస్తే ప్రైమరీలు, కాకస్‌లు నిర్వహిస్తారు. ప్రైమరీలను రాష్ట్ర ప్రభుత్వాలు, కాకస్‌లను పార్టీలు నిర్వహిస్తాయి. ప్రైమరీల్లో అభ్యర్థులకు రిజిస్టర్డ్ ఓటర్లు ఓటు వేస్తారు. కాకస్‌లో చర్చల ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు. వీటిల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకున్న వారే అభ్యర్థులుగా నిలుస్తారు.
డెలిగేట్స్, సూపర్ డెలిగేట్స్..
నేషనల్ కన్వెషన్‌లో రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారు డెలిగేట్స్. సూపర్ డెలిగేట్స్ అంటే ఆల్రెడీ పార్టీ అధ్యక్షులు లేదా మాజీ అధ్యక్షులు. నేషనల్ కన్వెన్షన్‌లో ఫైనల్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఇందులోనే డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా నిలబడాలి? రిపబ్లికన్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉండాలి? అని డిసైడ్ చేస్తారు. ఈ నేషనల్ కన్వెన్షన్ వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఏర్పాటవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఓ నెలపాటు జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన వారు ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే చాన్స్ ఉంటుంది. ఇదంతా జరిగాక ఎన్నికల ప్రచారానికి రెండు నెలల సమయం ఉంటుంది. ప్రస్తుతం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే అభ్యర్థులు ప్రచారం చేయాల్సి ఉంది. ఈ రెండు నెలల్లో ఎన్నికల ప్రచారానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తారు. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగానూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు రికార్డు సాధించాయి.
అభ్యర్థిపై అధికారిక ప్రకటన..
అధ్యక్ష బరిలో నిలిచే తుది అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడానికీ ఒక ప్రక్రియ ఉంటుంది. ఆయా పార్టీల జాతీయ సమావేశాల్లోనే వారిని అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రతినిధుల కేటాయింపు విధానం రెండు పార్టీలకు వేర్వేరుగా ఉంటుంది. డెమొక్రాట్లు అయితే ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్లు, మద్దతుదారుల నిష్పత్తి ఆధారంగా వారికి ప్రతినిధులను కేటాయిస్తారు. రిపబ్లికన్లలో అయితే నిష్పత్తి విధానంతోపాటు ‘విజేతకే మొత్తం ప్రతినిధులు’ అన్న విధానాన్ని కూడా అనుసరిస్తారు. అంటే ప్రైమరీలు, కాకస్‌లలో ఎక్కువ ఓట్లు సాధించిన వారికే మొత్తం ప్రతినిధులను కేటాయిస్తారు. మొత్తం మీద ఈ ప్రక్రియ సంక్లిష్టంగానే ఉంటుంది. రాష్ట్రానికీ, రాష్ట్రానికీ విధానం మారుతుంది.
ఎన్నికల ప్రచారం ఇలా..
మన ఇండియాలో ఎన్నికలు వచ్చాయంటే భారీ ర్యాలీలు, భారీ సభలు, సమావేశాలు జరుగుతుంటాయి. కానీ.. అమెరికాలో అలాంటి వాటికి నిషేధం. కేవలం టీవీల్లోనే డిబేట్లు జరుగుతాయి. రెండు పార్టీల అభ్యర్థులూ లైవ్ టీవీ డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ మొదటి మంగళవారం ఎన్నిక జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 3న పోలింగ్ తేదీ ఉంది. ఆ రోజున అమెరికా ప్రజలు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక అమెరికా అంతటా ఒకే రోజు జరుగుతుంది. ఆ రోజు అధ్యక్షుడి ఎన్నిక, పార్లమెంట్ సభ్యుల ఎన్నిక, కాన్సిలర్ల ఎన్నిక, గవర్నర్ల పోస్టుకు ఎన్నిక అన్నీ జరుగుతాయి. మొత్తంగా ఎవరైతే 270 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు సాధిస్తారో, వారు అధ్యక్షులుగా గెలుపొందుతారు.
మంగళవారమే ఎందుకు?
అమెరికా ఎన్నికలు ప్రతిసారీ నవంబర్‌లో వచ్చే మొదటి మంగళవారం రోజే నిర్వహిస్తారు. అయితే.. మంగళవారమే నిర్వహించడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది. 19వ శతాబ్దంలో, అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం ఆధారంగా నడిచేది. ఈ కాలంలో చాలా మంది ప్రజలు పొలాల్లో పనిచేశారు. ఓటర్లు కాలి నడకన, గుర్రాలపై ప్రయాణించి వచ్చి ఓటు వేసేవారు. అప్పుడు ప్రవేశపెట్టిన పద్ధతే ఇప్పటికీ అమెరికాలో కొనసాగుతున్నది. నవంబర్ నెల నాటికి పంటలు కోతకు వస్తాయి. చలి తీవ్రత అంతగా ఉండదు. దాంతో ప్రజలకు ఓటు వేయడానికి వెసులుబాటు లభించడమే కాకుండా వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఆదివారం చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. సోమవారం నాటికి వారంతా కౌంటీకి చేరుకోవడానికి వీలవుతుంది. మంగళవారం ఓటేస్తే బుధవారం అంగడి రోడు హడావిడి లేకుండా పనులు చేసుకోవచ్చు. అందుకే.. మంగళవారం పోలింగ్ నిర్వహిస్తుంటారు. 1800 నాటి ఎన్నికల వ్యవస్థ ఎక్కువగా గ్రామీణ జనాభా అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు.
పాలనలో పూర్తి స్వేచ్ఛ
ఎన్నికల్లో గెలిచిన వారు 2025 జనవరి నుంచి నాలుగు సంవత్సరాలు ఆ దేశాన్ని పాలిస్తారు. కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలికి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో అతను లేదా ఆమె శాసనాల ఆమోదానికి కాంగ్రెస్‌తో తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే చట్టాలను ఆమోదించడంలో కీలకపాత్ర పోషించే కాంగ్రెస్ సభ్యులను కూడా ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుంటారు. ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించడానికి, విదేశాంగ విధానాన్ని అమలు చేయడానికి ప్రెసిడెంట్‌కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది.