Russia : అమెరికా వల్లే యుద్ధం దీర్ఘకాలం సాగుతోంది : రష్యా

by S Gopi |
Russia : అమెరికా వల్లే యుద్ధం దీర్ఘకాలం సాగుతోంది : రష్యా
X

దిశ, వెబ్ డెస్క్ : ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుధ్దం అమెరికా వల్లే సుదీర్ఘకాలం కొనసాగుతోందని, ఈ యుద్ధంలో అత్యధికంగా నష్టపోయేది ఉక్రెయిన్ ప్రజలేనని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి నికోలయ్ పాట్రుషెవ్ అన్నారు. 'ఇజ్ వెస్తియా డైలీ' అనే వార్తా సంస్థకు ఆయన బుధవారం ఇచ్చిన ఇంటర్వూలో పాట్రుషెవ్ యుద్ధ పరిస్థితుల గురించి మాట్లాడారు.

రష్యా దేశ సరిహద్దుల్లో నాటో బలగాలు మోహరించాయని.. అలా చేయడం వల్ల అమెరికా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిందని పాట్రుషెవ్ మండిపడ్డారు. అమెరికాతో ఉంటే ఉక్రెయిన్‌ దేశ స్వాతంత్ర్యానికే ప్రమాదమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ పూర్తిగా నాశనం అయ్యేంత వరకు అమెరికా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందని పాట్రుషెవ్ వ్యాఖ్యానించారు.

"రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టి యుద్ధం గురించి అమెరికా చాలా సునాయాసంగా మాట్లాడగలదు.. ఎందుకంటే అమెరికా భూభాగంపై 1865 తరువాత యుద్ధం జరుగలేదు. రష్యాను బలహీన పరచడానికి 1990వ దశకం నుంచి అమెరికా ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేస్తూ ఉంది," అని ఆయన అన్నారు. అలాగే యూరోపియన్ దేశాలలో నీతి, మేధస్సు కల రాజకీయ నాయకులు లేరని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed