ఇజ్రాయెల్‌కు భారీ షాక్: దౌత్య సంబంధాలను నిలిపివేసిన కొలంబియా!

by samatah |
ఇజ్రాయెల్‌కు భారీ షాక్: దౌత్య సంబంధాలను నిలిపివేసిన కొలంబియా!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెంచుకోనున్నట్టు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఆయన జాతి హత్యగా అభివర్ణించారు. బొగాటోలో జరిగిన మేడే ర్యాలీలో ఆయన ప్రసంగించారు. త్వరలోనే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను విచ్చిన్నం చేస్తాం అని ప్రకటించారు. దాదాపు 34,500 మంది పాలస్తీనియన్లను చంపిన విధ్వంసకర సైనిక దాడిని వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు. గాజాలో జరుగుతున్న దారుణ పరిస్థితులను చూస్తే ఏ దేశమూ ఉరుకోబోదని తెలిపారు. పాలస్తీనా చచ్చిపోతే మానవత్వం చచ్చిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును తీవ్రంగా విమర్శించారు.

మరోవైపు పెట్రో ప్రకటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పందించారు. పెట్రో ద్వేషంగా ఉన్నారని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హమాస్‌కు బహుమతి అందజేసినట్టుగా ఉన్నాయని అభివర్ణించారు. కొలంబియా హంతకులకు, రేపిస్టులకు మద్దతు ఇచ్చిందని ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘పిల్లలకు కాల్చి చంపి, మహిళలపై దారుణాలకు ఒడిగట్టి, అమాయక పౌరులను కిడ్నాప్ చేసిన అత్యంత కఠినమైన రాక్షసుల పక్షా నిలబడాలని పెట్రో నిర్ణయం తీసుకున్నారు. దీనిని చరిత్ర గుర్తుంచుకుంటుంది’ అని పేర్కొన్నారు. ఇది ఎప్పటికీ సరైన పద్దతి కాదని సూచించారు.

గతంలోనూ ఇజ్రాయెల్ పొరుగున ఉన్న బొలీవియా గతేడాది అక్టోబర్‌లో గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించింది. కొలంబియా, చిలీ సంప్రదింపుల కోసం తమ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. హోండురాస్‌ కూడా ఇజ్రాయెల్‌తో తమ సంబంధాలను తెంచుకుంది. మరోవైపు మెక్సికో, బ్రెజిల్ వంటి ఇతర లాటిన్ అమెరికా దేశాలు కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి. కాగా, రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కొలంబియా ప్రకటన రావడం గమనార్హం.

Advertisement

Next Story