అమెరికాలో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రత నమోదు

by Swamyn |
అమెరికాలో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రత నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: గత రెండు మూడు రోజులుగా భూకంప వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో తైవాన్, చైనా, జపాన్, భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించగా, శుక్రవారం అమెరికాలో నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు న్యూజెర్సీలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైనట్టు యూఎస్‌ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. ఈ ప్రకంపనలు న్యూయార్క్‌‌నూ తాకినట్లు తెలిపింది. న్యూజెర్సీలోని వైట్‌హౌస్‌ స్టేషన్‌కు 7 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఆస్తి, ప్రాణనష్టం జరగినట్టు సమాచారం రాలేదని చెప్పారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో గాజా పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం జరగుతుండగా ప్రకంపనలు రావడంతో సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపేశారు.


Advertisement

Next Story