వేలంలో సరికొత్త రికార్డు.. కారు ఫ్యాన్సీ నంబర్‌కు రూ.122 కోట్లు

by GSrikanth |   ( Updated:2023-04-10 14:55:48.0  )
వేలంలో సరికొత్త రికార్డు.. కారు ఫ్యాన్సీ నంబర్‌కు రూ.122 కోట్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దుబాయ్‌లో శనివారం రాత్రి జరిగిన ‘మోస్ట్ నోబుల్ నెంబర్’ వేలంలో ఓ నెంబర్ భారీ ధర పలికింది. P7 అనే కారు నంబర్ ప్లేట్ ఏకంగా 55 మిలియన్ దిర్హామ్‌లకు(దాదాపు 122 కోట్ల రూపాయలకు) అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. ఫ్రెంచ్-ఎమిరాటీ వ్యాపారవేత్త, టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకులైన పావెల్ వాలెరివిచ్ దురోవ్.. ఈ నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు. జుమేరాలోని ఫోర్ సీజన్స్ రిసార్ట్‌లో అతిథుల మధ్య నిర్వహించిన వేలం హోరాహోరీగా సాగింది. పదహారేళ్ల క్రితం(2008)లో అబుదాబిలో నంబర్ 1 ప్లేట్‌ను 52.5 మిలియన్ దిర్హాలకు ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 15 మిలియన్ దిర్హామ్‌తో ప్రారంభమైన బిడ్‌ నిమిషాల వ్యవధిలో 55 మిలియన్‌ దిర్హామ్‌లకు చేరుకొని రికార్డు సృష్టించింది.

వేలం పూర్తవగానే ప్రేక్షకుల చప్పట్లతో హాల్ మొత్తం మార్మోగింది. పావెల్ వాలెరివిచ్ దురోవ్‌కు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. P7తో పాటు మిగతా వీఐపీ నంబర్ ప్లేట్లు, ఫోన్ నంబర్‌లకు కూడా వేలం జరిగింది. ఈ వేలంతో మొత్తం 100 మిలియన్​ దిర్హమ్‌లు (223 కోట్ల రూపాయలు) సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ వేలం, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, ఎటిసలాట్ అండ్ డు అధ్వర్యంలో ఈ వేలం పక్రియ జరిగింది. ఇప్పటి వరకు దుబాయ్‌లో జరిగిన వేలంలో 'P7' మొదటి స్థానంలో నిలిచింది. కాగా, వైస్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించిన ‘1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్’ ప్రచారానికి మద్దతుగా, ప్రత్యేక వాహన ప్లేట్, ఫోన్ నంబర్‌ల కోసం ‘మోస్ట్ నోబుల్ నంబర్స్’ ఛారిటీ వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం వన్ బిలియన్ మీల్స్ ప్రచారానికి వెళుతుందని అధికారులు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం కృషి చేస్తుందని వారు వెల్లడించారు.

Also Read..

బాలుడికి దలైలామా క్షమాపణ.. ఆటపట్టించేందుకే అలా చేసినట్లు వ్యాఖ్య

Advertisement

Next Story