రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా!

by Shyam |
Srinivas Goud
X

దిశ, తెలంగాణ బ్యూరో : రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తుశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఆయన కార్యాలయలో రామ‌ప్ప ప్రాంత ప‌రిర‌క్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక నిర్వహణ క‌మిటీని, స్థానిక స్థాయిలో పాలంపేట ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయ‌డంపై రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ గురువారం స‌మీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామప్పకు యునెస్కో గుర్తింపు అంశం చివరి దశకు చేరిందన్నారు. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యులందరి సమ్మతిని పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

కాగా, అంతర్జాతీయ చారిత్రక కట్టడాలు, ప్రదేశాల మండలి రామప్పకు వారసత్వ హోదాను మూల్యాంకనం చేసి పలు సూచనలు చేసిందని ఆయన తెలిపారు. అందులో భాగంగా రామప్ప ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న రెండు చిన్న దేవాలయాలను కూడా ఈ ఆలయ పరిధిలోకి తీసుకురావాలని సూచించిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఆ భూమిని రామప్ప ఆలయానికి అందజేస్తూ ఇటీవల కలెక్టర్ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.

రాష్ట్ర, స్థానిక స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీలు

రామప్ప పరిసర ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణ, అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. దీనికి సంబంధించిన రాష్ట్రస్థాయి, స్థానిక స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి కమిటీలో చైర్మన్ గా ప్రభుత్వ పర్యాటక కార్యదర్శి వ్యవహరిస్తారు. నగర ప్రణాళిక, కేంద్ర పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ, నీటి పారుదల శాఖ, అగాఖాన్ కల్చరల్ ట్రస్ట్ కు చెందిన అధికారులు అధికారులు సభ్యులుగా ఉంటారు.

పాలంపేట ప్రత్యేక అభివృద్ధి అథారిటీకి సంబంధించి చైర్మన్ గా కలెక్టర్ వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యదర్శిగా జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి, సభ్యులుగా జిల్లా పర్యాటక అధికారి, జిల్లా హెరిటేజ్ అసిస్టెంట్ డైరెక్టర్, దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్, స్థానిక సర్పంచ్ ఉంటారు. వీరంతా రామప్ప పరిసరాల్లోని చెరువు, కొండలు, అటవీ భూములు, ఆలయ పవిత్రతను కాపాడాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story