క్యాన్సర్.. ఇలా క్యాన్సిల్!

by Shamantha N |
క్యాన్సర్.. ఇలా క్యాన్సిల్!
X

క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ‘ఐ యామ్ అండ్ ఐ విల్’ అనేది ఈ ఏడాది థీమ్. శరీరంలో లోని కణాలు నియంత్రణ కోల్పోయి పెరగడం వల్లే క్యాన్సర్ సంభవిస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. క్యాన్సర్ కు వయసుతో సంబంధంలేదు. ఏ వయసు వారికైనా ఇది సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో క్యాన్సర్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు కాన్సర్ మరణాలు రోజువారీ కొన్ని అలవాట్లు, తీసుకునే ఆహారంపై ఆధారపడే సంభవిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యం, పొగాకు వాడటం వల్ల క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. 22 శాతం క్యాన్సర్ మరణాల్లో అత్యధికంగా పొగాకు ఉత్పత్తులు వాడేవారి సంఖ్యే ఎక్కువ. ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ బారిన పడే మృతి చెందుతున్నారు. అల్ప, మధ్యస్థ ఆదాయమున్న దేశాల్లోనే 70 శాతం క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది.

భారత్‌లో ఈ రకమైన క్యాన్సర్‌లే అత్యధికం

భారత్‌లో అత్యధికంగా ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ, కొలరెక్టల్ వంటి క్యాన్సర్ కేసులే అత్యధికంగా నమోదవుతున్నాయని ఢిల్లీలోని సీనియర్ క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ విజయ్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా ఇవి ఏటా పెరుగుతున్నాయన్నారు. మన జీవనశైలే క్యాన్సర్ వృద్ధి చెందడానికి ప్రధానం కారణమని గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా యువతలోనే ఈ ముప్పు ఉంటున్నదనీ, వారి పూర్వీకుల్లో ఈ వ్యాధి లక్షణాలు లేకపోయినప్పటికీ, దీని బారిన పడుతుండటంపట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ వ్యాధి ఆరోగ్యాన్ని క్షీణింపజేయడంతోపాటు మానసికంగానూ దెబ్బతీస్తుంది. అందుకే క్యాన్సర్‍‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా శరీరంలోకి మిగతా భాగాలకూ సోకే ప్రమాదం ఉంది. క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం.. క్యాన్సర్ తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే పూర్వీకుల ఆరోగ్య చరిత్ర, జన్యుపరమైన రోగాల ద్వారా క్యాన్సర్ ముప్పును అంచనా వేయొచ్చు. రోజూ తప్పనిసరిగా వ్యాయమం చేయాలి. పొగతాగడం, మద్యం, రెడ్ మీట్ తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఏటా ఒక్కసారైనా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed