శీలం కాపాడుకోవడానికి శివంగిలా మారిన మహిళ.. ఏంచేసిందంటే..?

by Anukaran |   ( Updated:2021-07-17 05:31:53.0  )
channai
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడది ఆబల కాదు సబల అని చాలామంది మహిళలు నిరూపించారు. మగాళ్లు మృగాళ్లుగా మారి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారిని అంతమొందించడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకువచ్చింది. కానీ, ఇప్పటికి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు తగ్గలేదు. ఎన్ని ప్రభుత్వాలు చెప్పినా, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళ తనను తాను కాపాడుకోవడానికి స్వీయ పోరాటం చేయకతప్పదు. అప్పుడే ఇలాంటి ఆగడాలు తగ్గుతాయి అని నిరూపించింది ఓ మహిళ. తనపై ఓ మానవ మృగం అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తే .. అపర భద్రకాళిలా మారి అతడిని చీల్చి చెండాడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని మింజూర్ ఏరియాలో ఒక మహిళ(21) పొలం పనులకు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో అందరు భోజనానికి వెళ్లగా.. ఆమె ఒక్కతే పనులు చేస్తోంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తి(40) ఆమెను గమనిస్తూ దగ్గరికి వచ్చాడు. దీంతో మహిళ బయపడి దూరం జరగాలని ప్రయత్నించేలోపు ఆ కామాంధుడు ఆమెను చుట్టేశాడు. ఆమెను ఎత్తుకొని పక్కనే ఉన్న నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లాడు. మహిళా అతని నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నా, అతని బలం ముందు అది సరిపోలేదు. తనని వదిలేయమని ఎంతగా బతిమిలాడినా కామవాంఛతో రగిపోతున్న కామాంధుడు ఆమెను విడిచిపెట్టగాపోగా కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో మహిళ తన ధైర్యాన్ని అంతా కూడదీసుకుని అతడిని ఒక తన్ను తన్ని వెనక్కి నెట్టింది. దాంతో అతడు వెనక ఉన్న సూది రాయి మీద పడ్డాడు.

తల రాయికి ఢీకొట్టడంతో కామాంధుడు రక్తంమడుగులో పడి కొట్టుకుంటూ మృతిచెందాడు. ఇంకా కోపం తీరని మహిళ అతడిని రోడ్డు పక్కకి లాక్కెళ్లి గుంత తవ్వి పాతిపెట్టింది. ఆ తరువాత పక్కనే ఉన్న పొలంలోని వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హత్యకేసు కింద మహిళను పోలీసులు అరెస్ట్ చేయగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. మహిళ ఏ తప్పుచేయలేదని, ఏ వ్యక్తి అయినా తన ప్రాణ, మాన రక్షణలో భాగంగా అవతలి వ్యక్తిని చంపేసినా అది నేరం కాదని తెలిపారు. ఇలా ఓ వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొని, తనను తాను రక్షించుకొని, నలుగురికీ ఆదర్శంగా మారిన మహిళను పోలీసులు విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed