కోతులేగా అనుకుంటే.. బాలింత ప్రాణం తీశాయి!

by Sumithra |
కోతులేగా అనుకుంటే.. బాలింత ప్రాణం తీశాయి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ కోతుల గుంపు మహిళా ప్రాణాలు తీశాయి. అడవుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాలపై దండయాత్రలు చేస్తూ తోటలను, ఇళ్లను ధ్వంసం చేయడంతోపాటు మనుషులపై దాడులకు పాల్పడి తీవ్రగాయాలు చేస్తున్నాయి. వీటి ఆగడాలను అటు అధికారులు, ఇటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పండండి బిడ్డ జన్మించిందన్న మురిపెం తీరకముందే ఓ బాలింత వానరమూక దాడిలో కన్నుమూసింది. ఈ విషాద దుర్ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో కుక్కడం గ్రామానికి చెందిన దోమల శ్రీలత(23) మంగళవారం కోతుల గుంపు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో వారంతా పనికి వెళ్లారు. శ్రీలత ఇటీవలనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారితో ఆమె ఇంట్లోనే ఉండగా.. 9 గంటల సమయంలో కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించాయి. తన బిడ్డ మీద కోతులు దాడి చేస్తాయని భయపడిన ఆమె.. వాటిని తరిమె ప్రయత్నం చేసింది. వెంటనే వానరమూక ఆమెపై మూకుమ్మడిగా దాడి చేయడంతో గడపపై పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. బాలింత మృతితో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. శ్రీలతకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఓవైపు ముక్కుపచ్చలారని చిన్నారి తల్లి పాలకోసం ఆరాటం.. మరోవైపు తల్లి కోసం ఇద్దరు చిన్నారుల ఆర్తనాదాలు.. ఇంకోవైపు తనను పిల్లల్ని ఒంటరి చేసి వెళ్లావా అంటూ భర్త ఆక్రందనలను చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. కాగా గ్రామం నుంచి కోతులను తరిమేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలని ప్రశ్నిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed