ఆ జిల్లాలో విషజ్వరాలు.. వణికిపోతున్న గ్రామం

by Shyam |
ఆ జిల్లాలో విషజ్వరాలు.. వణికిపోతున్న గ్రామం
X

దిశ, నాగర్ కర్నూల్ : అధికారుల అలసత్వం వందల మందిని మంచం పట్టేలా చేసింది. దీంతొ ఒక మహిళ విషజ్వరంతో పోరాడుతూ మృతి చెందగా, మిగతా వందల సంఖ్యలో జనం మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలోని వడ్డెర బస్తీలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆ కాలనీకి మిషన్ భగీరథ నీరు అందక పోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా మంచి నీటిని సరఫరా చేశారు. అవి తాగిన కొద్దిరోజులకే గ్రామంలోని కాలనీ వాసులంతా తీవ్ర జ్వరాలతో మంచం పట్టారు. ఒక్కొక్కరికి పెట్లెట్స్ (తెల్లరక్త కణాలు) పూర్తిగా తగ్గి కోలుకుని స్థితి ఏర్పడింది. అందరికీ డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు చెపుతున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజామున ఓర్సు అలివేలు (40) అనే మహిళ పరిస్థితి విషమించి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

విషయం తెలుసుకోవడానికి కాలనీకి వచ్చిన వైద్య అధికారి సుధాకర్ లాల్‌కు గ్రామస్తులు తిట్ల పురాణంతో ఎదురు తిరిగారు. కేవలం అధికారుల అలసత్వం వల్లే తమ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏది అడిగినా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండి పడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 120 కుటుంబాలు నివసిస్తున్న వాడలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికోసం పంపిన ట్రాక్టర్ హరితహారం మొక్కలకు పొసే నీటిని తీసుకొచ్చారని అందుకే వాడలోని ప్రజలందరూ అనారోగ్యంతో మంచం పట్టరాని మండిపడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. మరికొంతమంది హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మృత్యువు‌తో పోరాడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed