- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రాకతో.. గిరిజన ఆలయానికి మోక్షం కలిగేనా…?
దిశ ప్రతినిధి, నల్లగొండ: అది నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీప ప్రాంతంలో చలకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని కుంకుడుచెట్టు తండా. అక్కడ గిరిజన ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలమ్మ దేవాలయంలో 30 ఏండ్లుగా పూజలు చేస్తుంటారు. దాదాపు నాలుగున్నర ఎకరాల్లో ఆ ఆలయం విస్తరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగినట్టుగానే ఇక్కడా భారీగా జాతర జరుగుతుంది. ప్రతి ఏటా చిన్న జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. అక్కడి దేవతలను ఆ ఆలయ భూములను గత 30 ఏండ్లుగా ఒకే కుటుంబం కాపాడుకుంటూ వస్తోంది.
అయితే ఆ భూములపై కొంతకాలంగా స్థానిక అధికార పార్టీ నేతల కన్ను పడింది. దీంతో విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అటవీ అధికారులను ఆ ఆలయం, దాన్ని కాపాడుతూ వస్తోన్న కుటుంబంపై దాడులు చేయించింది. అర్ధరాత్రి.. అపరాత్రి అన్న తేడా లేకుండా సదరు కుటుంబంలోని మహిళలను ఇంటి నుంచి బయటకు ఈడ్చి లాక్కేల్లిన ఘటనలు లేకపోలేదు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో హాలియాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏండ్లుగా నాన్చుతున్న సమ్మక్కసారలమ్మ ఆలయానికి మోక్షం కలుగుతుందా.. లేదా.. అని గిరిజనులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
పాసుపుస్తకం ఉన్నా.. ఇండ్లు కూల్చి..
పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండాకు చెందిన గుంజ అంజమ్మ స్వాధీనంలో గత 30 ఏండ్లుగా నాలుగున్నర ఎకరాల భూమి స్వాధీనంలో ఉంది. అయితే ఆ భూమిలో సమ్మక్క సారలక్క వనదేవతలు ప్రతిష్టాపన జరగడంతో 30 ఏండ్ల నుంచి నిత్య పూజలు చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. సంబంధిత భూమికి 2002 సంవత్సరంలో ప్రభుత్వం అటవీ హక్కు పత్రాన్ని జారీ చేసింది. దీంతో సమ్మక్కసారలమ్మ ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా సంఘాన్ని సైతం రిజిష్టర్ చేశారు. అయితే గత రెండేండ్ల క్రితం అటవీశాఖ అధికారులు సంబంధిత భూమి అటవీశాఖకు చెందినదని, దాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఎటువంటి నోటీసులు లేకుండా ఆలయ నిర్వాహకులను అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. ఆలయ నిర్వహణ కోసం నిర్మించిన ఇంటిని, భక్తుల కోసం ఏర్పాటు చేసుకున్న మరుగుదొడ్లు, వాటర్ ట్యాంకులను దాదాపు 200 మంది పోలీసు బృందాలతో వచ్చి కూల్చివేశారు. అడ్డొచ్చిన మహిళలను పోలీసులతో బయటకు ఈడ్చేసి అటవీశాఖ అధికారులు బెదిరింపులకు దిగారు.
అధికార పార్టీ అండదండలతో..
నాలుగున్నర ఎకరాల విలువైన భూమిని కాజేసేందుకు కొంతమంది అధికార పార్టీ నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అటవీ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇంటిని కూల్చివేశారు. దీనికి ఇక్కడ అర్బన్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని, అందుకే ఖాళీ చేయిస్తున్నామని, సంబంధిత ఆలయ నిర్వాహకులు ఫేక్ పత్రాలు సృష్టించారంటూ చెబుతూ వస్తున్నారు. నిజానికి అదే నిజమైతే.. ఈ 30 ఏండ్లుగా అధికారులు ఏం చేశారనేది ప్రశ్నార్థకమే. ఈ సమీప ప్రాంతంలో మరో రెండు మూడు ఆలయాలు ఉన్నాయి. అయినా అటవీశాఖ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఎన్ని ఇబ్బందులు సృష్టించిన వారు అక్కడి నుంచి కదలకపోవడంతో సమ్మక్కసారలక్క దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా చేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారనే చెప్పాలి.
రెండేండ్లుగా గుడిసే ఆధారం..
అటవీ అధికారులు ఫేక్ పత్రాలంటూ 2019 నవంబరులో సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని, నిర్వాహకుల ఇంటిని నేలమట్టం చేశారు. అక్కడ మంచినీటి వసతి లేకుండా వాటర్ ట్యాంకులను కూల్చేశారు. ఇల్లును అటవీశాఖ అధికారులు కూల్చేయడంతో అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలోనే కాలం వెళ్లదీస్తు వస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నేతలు, అటవీ శాఖ అధికారులు చేసిన నిర్వాకంపై ఇప్పటికే గుడి నిర్వాహకులైన గుంజ అంజమ్మ, నాగపూరి లక్ష్మీలు కంటోన్మెంట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఆ కేసు ఉండగా, న్యాయస్థానం ఇటు అటవీశాఖను.. అటు ఆలయ నిర్వాహకులను మ్యుచువల్ అండర్ స్టాండింగ్ కింద ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని సూచించింది. కానీ అటవీశాఖ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
బడా నేతలంతా ఇక్కడ పూజలు చేసినోళ్లే..
సమ్మక్క సారలమ్మ దేవాలయంలో ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న బడా నేతలంతా పూజలు చేసిన వారే. గత ప్రభుత్వం గిరిజన శాఖ మంత్రిగా ఉన్న అజ్మీరా చందులాల్ నాయక్, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, దివంగత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తదితరులంతా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి వెళ్లిన వాళ్లే. అయితే వారి వెంట వచ్చిన అటవీ శాఖకు ఆ ఆలయం కన్పించలేదా.. అసలు ఆలయం తొలగింపు వెనక ఉన్నవారేవరనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని ఆలయ నిర్వాహకులు అంటున్నారు.
అన్ని పత్రాలున్నాయ్..
సమ్మక్క సారలమ్మ ఆలయానికి సంబంధించిన భూమికి అన్ని పత్రాలున్నాయి. సాక్షాత్తూ ప్రభుత్వమే మాకు పత్రాలను మంజూరు చేసింది. కావాలనే కొంతమంది అధికార పార్టీ నేతలు మాపై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నారు. మాపై కక్ష సాధించినా ఫర్వాలేదు. కానీ ఇక్కడికి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేయోద్దు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి.
– గుంజ అంజమ్మ, ఆలయ నిర్వాహకురాలు
నిలువ నీడ లేకుండా చేశారు..
30 ఏండ్లుగా సమ్మక్క సారలమ్మలు ఇక్కడే పూజలు అందుకుంటున్నారు. మాకు ఎప్పుడు ఇలాంటి సమస్య ఎదురుకాలేదు. గత రెండు మూడేండ్లుగా కావాలనే కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారు. గిరిజన దేవతలపై ఎందుకీ వివక్ష. గుడి పరిధిలోని ఇంటిని, మరుగుదొడ్లు, వాటర్ ట్యాంకులను కూల్చేశారు. దీంతో రెండేండ్లుగా తాత్కాలిక గుడిసెలోనే కాలం వెళ్లదీస్తున్నాం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
– నాగపూరి లక్ష్మీ, ఆలయ నిర్మాణ సంస్థ కార్యదర్శి