రూ. 3 లక్షల కోట్ల మర్కెట్ క్యాప్ సాధించిన విప్రో..

by Harish |   ( Updated:2021-06-03 05:04:07.0  )
రూ. 3 లక్షల కోట్ల మర్కెట్ క్యాప్ సాధించిన విప్రో..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో గురువారం అరుదైన ఘనతను సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ. 3 లక్షల కోట్లను నమోదు చేసిన మూడో కంపెనీగా నిలిచింది. దేశీయ ఇతర దిగ్గజ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్ తర్వాత ఈ మైలురాయిని అధిగమించిన భారత ఐటీ కంపెనీగా విప్రో గౌరవం దక్కించుకుంది. గురువారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన అనంతరం విప్రో షేర్ ధర రూ. 550 వద్ద ట్రేడయింది. దీంతో విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3.01 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విప్రో షేర్ 41 శాతం లాభపడింది.

గతేడాది జూన్‌లో పడిపోయిన కనిష్ట స్థాయి నుంచి ఇది 164 శాతం లాభపడినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఓ నివేదిక ప్రకారం.. విప్రో సంస్థ సీఈఓ, ఎండీగా ఉన్న థియరీ డెలాపోర్ట్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కంపెనీ షేర్ ధర పెరుగుతోంది. అంతేకాకుండా, థియరీ డెలాపోర్ట్ సారథ్యంలోనే జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఏకంగా 7.1 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఒప్పందం జరిగింది. ప్రస్తుత పురోగతితో విప్రో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశీయ జాబితాలో 14వ స్థానంలో ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత నెల రోజుల్లోనే విప్రో షేర్ ధర 11.44 శాతం పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా, దేశీయంగా అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ జాబితాలో రూ. 14.05 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత రూ. 11.58 లక్షల కోట్లతో టీసీఎస్, రూ. 8.33 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యంకులు ఉన్నాయి.

Advertisement

Next Story