మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి పేరుతో వైన్స్‌షాప్.. ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని ఉందా..?

by Shyam |
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి పేరుతో వైన్స్‌షాప్.. ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని ఉందా..?
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : అమ్మా.. నీ కొడుకు ఎక్సైజ్ శాఖ మంత్రి.. అందుకే నీకు మొక్కి వెళుతున్న.. నాకు ఎలాగైనా వైన్ షాప్ టెండర్ దక్కేలా చూడు తల్లి అని వేడుకుని వెళ్ళా.. అలా కోరిక కోరానో లేదో ఆ అమ్మ కరుణ వలన నాకు వైన్ షాప్ దక్కింది. అందుకే ఆమె పేరిటనే వైన్‌షాప్ ఏర్పాటు చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా తన వైన్ షాప్‌ను బుధవారం ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు సుగురు నితిన్ కుమార్..

వివరాల్లోకివెళితే.. భూత్పూర్ మండల కేంద్రం సుగురు మురళి దంపతుల కుమారుడు బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం చూడకుండా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. తన తల్లిదండ్రులను వైన్‌షాప్ టెండర్ వేసేందుకు ఒప్పించాడు. ఈ క్రమంలోనే భూత్పూర్ నుంచి మహబూబ్ నగర్ వెళ్లే రోడ్డు సమీపంలో మంత్రి వ్యవసాయ ఫామ్‌హౌస్ వద్ద ఇటీవలే దివంగతురాలైన శాంతమ్మ సమాధి, ఫ్లెక్సీ ఉండటంతో ఆమెకు మొక్కి.. అమ్మ నీ కొడుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి.. నీ దయతో నాకు టెండర్ దక్కితే షాపునకు నీ పేరు పెట్టుకుంటానని వేడుకున్నాడు.. ఆ తర్వాత వెళ్లి ఒకే ఒక టెండర్ వేసి ఇదే విషయాన్ని ఆ యువకుడు టెండర్ల ఖరారుకు ముందే తన మిత్రులతో చెప్పుకున్నాడు.

లక్కీ డ్రాలో నితిన్ వేసిన ఒకే ఒక టెండర్‌కు లక్ తగిలింది. దీనితో అతనికి వైన్‌షాప్‌ను అధికారులు కేటాయించారు. తనకు వైన్ షాప్ ఖరారు కాగానే నేరుగా ఆ యువకుడు తన తండ్రిని తీసుకుని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. తనకు వచ్చిన వైన్ షాప్‌ను మీ అమ్మగారు శాంతమ్మ పేరుతో ఏర్పాటు చేస్తానని, అందుకు మీ అనుమతి కావాలని పదే పదే కోరాడు. ఎంతగా చెప్పినా ఆ యువకుడు వినిపించుకోకపోవడంతో చివరకు మంత్రి సరే అన్నాడు. దీంతో తన షాపునకు శాంతమ్మ వైన్ షాప్ అని నామకరణం చేశాడు. జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పదే పదే విజ్ఞప్తి చేయడంతో తప్పని పరిస్థితులలో బుధవారం సాయంత్రం భూత్పూర్‌కు చేరుకుని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి తన తల్లి చిత్రపటానికి పూజలు చేసి మంత్రి వైన్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యువకుడు మంత్రి, ఎమ్మెల్యే ఆశీర్వాదం తీసుకున్నాడు. నిబంధనల ప్రకారం వ్యాపారం చేసి మంచి లాభాలు గడించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతనికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed