చైనా, పాక్‌‌కు భారత్‌ మరో షాక్

by Anukaran |
చైనా, పాక్‌‌కు భారత్‌ మరో షాక్
X

న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్ నుంచి విద్యుత్ రంగంలో అవసరమున్న పరికరాలను దిగుమతి చేసుకోవద్దని సూచించారు. విద్యుత్ రంగ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా చైనా నుంచి దిగుమతి చేసుకోరాదని తెలిపారు. అటువంటి దిగుమతులను ట్రోజన్ హార్స్ లేదా మాల్వేర్‌గా ఉపయోగించుకుని పవర్ గ్రిడ్లను షట్‌డౌన్ చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు.

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం, చైనా సహా ఇతర విదేశాల నుంచి విద్యుత్ సరఫరా పరికరాలు, కాంపోనెంట్స్ దిగుమతి చేసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని కేంద్రం గుర్తించిన ల్యాబ్‌లలో పరిశీలిస్తారు. భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? మాల్వేర్, వైరస్ లాంటివేమైనా నిక్షిప్తం చేసి ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తారు.

తాజాగా, రాష్ట్రాల విద్యుత్ శాఖా మంత్రలుతో సమావేశమైన కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్.. ‘2018-19 కాలంలో విద్యుత్ రంగ మొత్తం దిగుమతులు సుమారు రూ. 71వేల కోట్లల్లో చైనా నుంచే 21వేల కోట్ల విలువైన పరికరాలు దిగుమతి అయ్యాయి. దీన్ని సహించబోం. మనదేశంలోకి చొరబడాలని యత్నించే దేశం, మన జవాన్లను చంపేసిన దేశంలో ఉపాధి సృష్టిస్తున్నామా? ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌ల నుంచి విద్యుత్ రంగ దిగుమతులకు అనుమతించవద్దని నిర్ణయించాం. ఆ పరికరాల్లో వైరస్ ఉండి ఎక్కడి నుంచో మన విద్యుత్ వ్యవస్థను ఆపరేట్ చేసే ప్రమాదముంది. చిన్న, చిన్న పరికరాలు, భారత్‌లో తయారయ్యేవాటినీ వేరేదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సరికాదని, ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ఇక్కడ లభించే పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవద్దు’ అని తెలిపారు.

Advertisement

Next Story