సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. నల్లగొండలో బూడిదపాలేనా..?

by Anukaran |
Chief-Minister-KCR
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరు కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి సాగునీటి ప్రాజెక్టులపైనే ఎక్కువగా ద‌ృష్టి సారించారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ ఊహించని స్థాయిలో భారీగా నిర్మించారు. అందుకోసం నిర్మాణ వ్యయం భారీగా ఖర్చు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం కాస్త.. లోటు బడ్జెట్‌ తెలంగాణగా మారడానికి ప్రధాన కారణం సాగునీటి ప్రాజెక్టులే. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టులతో రైతాంగానికి ఎంత ఉపయోగం ఉండనుందనే దానిపై మొదట్నుంచీ అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ అనుమానాలకు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే బలాన్ని చేకూరుస్తున్నాయనడంలో ఏలాంటి సందేహం లేదు. కేంద్రం వ్యాఖ్యలకు తోడు సీఎం కేసీఆర్ ఇటీవల వరి పంట సాగుపై చేసిన వ్యాఖ్యలతో ఇటు రైతాంగం.. అటు పారాబాయిల్డ్ రైసు మిల్లర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

అసలు కథ ఏంటంటే..?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి 60 లక్షల టన్నులకు మించి కొనుగోలు వరిధాన్యాన్ని చేయబోమంటూ స్పష్టం చేసింది. దీన్ని సమర్థించేలా తెలంగాణ సీఎం కేసీఆర్.. భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైసు మిల్లులు మూసేసుకోవాల్సి వస్తుందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాలంటూ హితవు పలికారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. నిజానికి సీఎం కేసీఆర్ వ్యవసాయం కోసమే రూ.వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఆ నీటినే ప్రతి జిల్లాకు అందించి బీడు భూముల్లో బంగారం పండించామంటూ అధికార పార్టీ గణమంతా ఢంకా బజాయించి చెబుతోంది. అయితే సీఎం కేసీఆర్ చెప్పినట్టు వరి పంటల సాగుకు మినహా ఇతర పంటలకు పెద్దగా నీటి అవసరం ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నట్టు ఆరుతడి పంటలను సాగుచేస్తే.. కాళేశ్వరం నీళ్ల అవసరమే ఉండదు. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుచూపు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.వేల కోట్లు ఖర్చు చేసిందా.. అనే ప్రశ్న రైతాంగం నుంచి ఎదురవుతోంది. అసలు వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని చెబుతున్న సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీటిని ఏం చేస్తారో అంతుచిక్కడం లేదు.

రాష్ట్రంలో రికార్డు స్థాయి వరి ధాన్యం దిగుబడులు..

తెలంగాణ రాష్ట్రంలో 2019-20 ఏడాది రికార్డు స్థాయి దిగుబడులు వచ్చాయి. ఆ ఏడాది వానాకాలం సీజనులో 47 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 65 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి.. అంటే మొత్తంగా ఆ ఏడాదిలో 1.12కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదే ఆరేండ్ల క్రితం అంటే 2014-15 సంవత్సరంలో వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి కేవలం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడు రికార్డు స్థాయిలో వరి పంట దిగుబడులు పెరిగాయి. ఇదంతా సాగునీటి ప్రాజెక్టుల నీటి పుణ్యమేనంటూ అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కేంద్రం కేవలం 60 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతోంది. ఈ లెక్కన మిగిలిన ధాన్యం రైతాంగం ఎక్కడ అమ్ముకోవాలో అంతుచిక్కడం లేదు. నిజంగా కేంద్రం కొనుగోలు చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోయినా.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అడ్డికి పావు సేరు అన్న చందంగా అమ్ముకోవాల్సి వస్తుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..

కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో సూర్యాపేట జిల్లా సస్యశామలం అయినట్టు అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం నీటి వల్ల జిల్లాలో పడావు భూములు సాగులోకి వచ్చి ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. దీంతో వరి దిగుబడులు కావాల్సిన దాని కంటే చాలా ఎక్కువ సప్లై పెరిగింది. దీంతో పాటు నాగార్జునసాగ ర్‌ ఎడమ కాల్వ, మూ సీ, డిండి ప్రాజెక్టుల నుంచి సమృద్ధిగా సాగునీరు అందుబాటులోకి రావడం,చెరువుల్లో నీటి నిల్వలు ఉండటం మూలంగా భూగర్భ జలాలు పెరగడంతో బావులు, బోర్ల కింద వరి సాగు పెరిగింది. రెండు కార్లు పత్తి సాగు చేసే రైతులు దానికి బదులుగా ఒక సీజన్‌ పంట వరికి మారారు. మొత్తంగా జిల్లాలో 7.79లక్షల మెట్రిక్‌ టన్నులు దొడ్డు ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని, మిగిలిన సుమారు 2.20లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యాన్ని రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించారు. ఇదిలావుంటే.. నల్లగొండ జిల్లాలో 7,83,574 మెట్రిక్ టన్నులు, సూర్యాపేటలో 6,49,192 మెట్రిక్ టన్నులు, యాదాద్రిలో 4,06, 859 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు చెబుతుండడం గమనార్హం.

కాళేశ్వరం నీళ్లు దేనికోసం..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేస్తోన్న పంటల్లో కేవలం వరి పంటకే అత్యధికంగా నీటి వినియోగం అవసరం ఉంది. చెరుకు పంట మినహా ఇతర పంటలన్నీ దాదాపుగా ఆరు తడి పంటలే. నీటి అవసరం పెద్దగా ఉండబోదు. అయితే సీఎం కేసీఆర్ వరి పంటను సాగు చేయోద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.వేల కోట్లు ఖర్చు చేసి ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని సూర్యాపేట జిల్లాలోని మారుమూల పల్లెలకు సైతం తీసుకొచ్చారు. దాంతో ప్రభుత్వ ఖజానాపై భారీగా ఎఫెక్ట్ పడింది. అయితే ఇప్పుడు రైతాంగం వరి పంట సాగు మానేస్తే.. ఆ నీటి వినియోగం పెద్దగా అవసరం ఉండబోదు. ఉద్యాన పంటలతో పాటు ఇతర ఆరుతడి పంటలకు ఇప్పటికే స్థానికంగా రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు సరిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు చూపు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందా..?. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వరి పంట సాగును మాన్పించేస్తుందా..?. అలా అయితే పారాబాయిల్డ్ రైసు మిల్లుల పరిస్థితి ఏంటి..? అనే అంశాలపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది.

Advertisement

Next Story