అర్ధాకలితో పుస్తకాలపై కుస్తీ..

by Aamani |
అర్ధాకలితో పుస్తకాలపై కుస్తీ..
X

దిశ, కామారెడ్డి : ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులు అర్ధాకలితోనే చదువుకోవాల్సి వస్తుంది. ఉదయం హడావుడిగా స్పెషల్‌ క్లాసులకు హాజరవుతుండగా తిరిగి ఇంటికి చేరేసరికి రాత్రవుతున్నది. మధ్యాహ్న భోజనం తప్ప ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, సాయంత్రం స్నాక్స్‌ తెచుకోవడానికి సమయం లేకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు నిధుల కోసం ప్రతీ సంవత్సరం అడుక్కోవాల్సి వస్తుండడంతో ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 10 జీపీఏ సాధించేలా పరీక్షలకు సిద్ధం చేయాలనేది ఆదేశాలు. పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయడమే కాకుండా రివిజన్స్‌ చేయించడం, పరీక్షలకు సంసిద్ధం చేయడం కోసం అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గత నెల నుంచే ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. అయితే చలి తీవ్రత కూడా పెరుగుతుండడంతో ఉదయం పూట ఆకలితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం లేదంటే దాతల ద్వారా పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ లేదా అల్పాహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు ముందుకురాకపోవడంతో స్పెషల్‌ క్లాసులు ప్రారంభమై నెలన్నర గడిచినా విద్యార్థులకు స్నాక్స్‌ అందించడం లేదు. దీంతో వారంతా ఆకలితోనే పాఠాలు వినాల్సి వస్తుంది. అధికారులు విద్యార్థుల ఆకలి తీరే మార్గం ఆలోచిస్తారేమో చూడాలి.

జిల్లా వ్యాప్తంగా 12000 మంది పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనుండగా అందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వాళ్ళు సగం మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పేద, మధ్య తరగతి వాళ్లే అధికంగా ఉన్నారు. గతేడాది కంటే ఈ సారి ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనూ 100 శాతం ఉత్తీర్ణత వచ్చేలా చూడాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే దానికి తగ్గట్టుగా తరగతులు నిర్వహిస్తున్న విద్యార్థులకు అల్పాహారం అందక మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతోనే ఉండవలసి వస్తుంది.

ప్రత్యేక తరగతులు..

పదో తరగతి విద్యార్థుల్ని వార్షిక పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉదయం పూట గంట, సాయంత్రం పూట మరో గంట ప్రత్యేక క్లాసులు బోధిస్తున్నారు. ఉదయం పూట 8.45 గంటల వరకు పదో తరగతి విద్యార్థులు స్కూల్‌లో ఉంటున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇంటి నుంచి ఉదయం 7.45 నుంచే బయలుదేరి స్కూల్‌కు వస్తున్నారు. సాయంత్రం పూట స్కూల్‌ సమయం ముగియగానే 4.15 నుంచి 5.15 వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్ని గ్రూపు లుగా విభజించి ఒక్కో గ్రూప్‌నకు ఒక టీచర్‌ను కేటాయించారు. ప్రతి వారం సైకిలింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 31 వరకు 100 శాతం సబ్జెక్ట్స్‌ పూర్తి చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. సబ్జెక్ట్‌ వారీగా మాడ్యూల్‌ రూపొందించి జనవరి నుంచి రివిజన్స్‌ నిర్వహిస్తారు. బోధన పూర్తికాగానే పాఠ్యాంశానికి సంబంధించిన ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగి ఆ తరగతి గదిలోనే నివృత్తి చేస్తారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ ఫొటోలను విద్యా శాఖ వాట్సప్‌ గ్రూపులో సెండ్‌ చేస్తారు.

గతంలో దాతల సాయంతో స్నాక్స్‌..

గతంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించిన సమయంలో అక్కడక్కడ కొంతమంది జిల్లా, మండల స్థాయి అధికారులు చొరవ చూపి దాతల సహాయంతో అల్పాహారం, స్నాక్స్‌ అందించేవారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా సహకరించారు. తమ వంతు సాయం తో స్నాక్స్ పెట్టారు. స్థానిక గ్రామ పంచాయతీలు, పిల్లల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తుల్ని ఇప్పించి పిల్లలకు స్నాక్స్‌ పెట్టేలా ప్రయత్నం చేశారు.

ఆకలితో విద్యార్థుల చదువులు..

ఉదయం 7.30 గంటలకే ఇంటి నుంచి బయలుదేరి పాఠశాలకు వస్తున్న విద్యార్థులు సాయంత్రం 5.30 వరకు పాఠశాలలోనే ఉండాల్సి ఉంది. దీంతో రోజులో వారు భోజనం చేసేది మధ్యాహ్నం మాత్రమే. ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపులతో అలాగే చదువులు సాగిస్తున్నారు. పొద్దున ఇంటి వద్ద భోజనం తయారు కాకపోవడం, హడావుడిగా రెడీ అయ్యి స్కూల్‌కు వస్తుండటంతో భోజనం చేయకుండానే వస్తున్నారు. సాయంత్రం వరకు స్కూల్‌లో ఉండే విద్యార్థులు ఇంటి నుంచి స్నాక్స్‌ తెచ్చుకునే పరిస్థితి లేదు. ప్రత్యేక తరగుతుల్లో మైండ్‌ పెట్టి చదువుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక పక్క చలి ప్రభావం, మరో పక్క ఆకలి మంటతో విద్యార్థులు చదువులపై ఆసక్తి చూపని పరిస్థితి ఉంటుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

దాతలతో స్నాక్స్ పెట్టేలా కృషి చేస్తున్నాం : రాజు, డీఈవో

పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ ఇచ్చేందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చడానికి దాతలను కోరుతున్నాం. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 12000 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారికి స్నాక్స్‌ అందించేందుకు స్థానిక అధికారులతో పాటు ఆయా పాఠశాలల ఉపాద్యాయులు కొంతమంది ముందుకు వస్తున్నారు. వారి సహకారంతో అల్పాహారం, స్నాక్స్ పెట్టించే ఏర్పాట్లు చేస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed