Odisha: ఒడిశాలో 'పేదరికం' కారణంగా నవజాత శిశువును విక్రయించిన దంపతులు

by S Gopi |
Odisha: ఒడిశాలో పేదరికం కారణంగా నవజాత శిశువును విక్రయించిన దంపతులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ జంట తమ నవజాత శిశువును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు మయూర్‌భంజ్ జిల్లాలో సంతానం లేని దంపతులకు తమ బిడ్డను విక్రయించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఆ జంట బస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని హదమౌడా గ్రామంలో ధర్మూ బెహెరా, అతని భార్య శాంతిలతగా గుర్తించారు. డిసెంబరు 19న శాంతిలత బరిపాడలోని పండిట్ రఘునాథ్ ముర్ము మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు. మూడు రోజుల తర్వాత ఆమె డిశ్చార్జ్ అయింది. అయితే, గ్రామస్థులు వారి ఇంటిలో నవజాత శిశువు లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 'పేదరికం' కారణంగా దంపతులు మధ్యవర్తి ద్వారా శిశువును విక్రయించారని వారు అనుమానించినట్టు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు, మయూర్‌భంజ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. మయూర్‌భంజ్ జిల్లాలోని సైంకోలా బ్లాక్ పరిధిలో మనీచా గ్రామానికి చెందిన దంపతుల ఆధీనం నుంచి శిశువును రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, శిశువును విక్రయించిన కుటుంబం నవజాత శిశువును విక్రయించలేదని, స్థానికుల ఆరోపణలను ఖండించారు. సంతానం లేని దంపతులకు బిడ్డను దానం చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story