- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి భారీ షాక్... జనసేనలోకి సంధ్యా విక్రమ్ కుమార్
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఘోర ఓటమి తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొన్న కోడుమూరు నియోజకవర్గ నాయకుడు, వైసీపీ రాష్ర్ట కమిటీ సభ్యుడు సంధ్యా విక్రమ్ కుమార్, నిన్న కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఐఏఎస్ ఏఎండీ ఇంతియాజ్‌లు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి రాజకీయాల నుంచి తప్పుకోగా సంధ్యా విక్రమ్ కుమార్ మాత్రం వైసీపీలో తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీని వీడి జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకరు ఓటమి భారం, మరొకరికి ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. వీరు పార్టీని వీడడంతో ఆ పార్టీ నేతలు సందిగ్ధంలో పడ్డారు.
దిశ ప్రతినిధి, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జి, రాష్ర్ట కమిటీ సభ్యులు ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పారు. కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ 2024 ఎన్నికల్లో పరాభావం తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వస్తూ వెళ్తున్నారు తప్ప పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు. ఓటమి తర్వాత ఐదేళ్లు పార్టీని ముందుకు తీసుకెళ్లడం ఖర్చుతో కూడిన పని కావడంతో మౌనంగా ఉండిపోయారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వెంటనే వైసీపీ అధినేత జగన్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, డాక్టర్ హఫీజ్ ఖాన్ లకు కాదని మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ కు టికెట్ కేటాయించారు.
వైసీపీ పెద్దలకు బుద్ధిచెప్పిన కర్నూలు ఓటర్లు..
సీటు దక్కని మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ, వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ కర్నూలు నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కు పట్టం కట్టారు. ఈ ఓటమి పార్టీ పెద్దలతో పాటు జిల్లా నేతలకు కనువిప్పు కల్గించింది. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేతలకు కాకుండా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం మైనస్ గా మారింది. వీటికి తోడు ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ లు నియోజకవర్గంలో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిద్దరు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తు న్నారు.
కార్యకర్తలకు అందుబాటులో..
మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలుస్తూ వచ్చారు. అయినా ఇంచార్జి బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో తెలియక కర్నూలు జిల్లా కేంద్రంలో 44 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 12 మంది టీడీపీలో చేరారు. అయితే ఈయన పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో రాజీనామా చేశారని కొందరు చర్చించుకుండగా మరికొందరు మాత్రం ఐదేళ్లు పార్టీని నెట్టుకురావడం కష్టంతో పాటు ఖర్చుతో కూడిన పని కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చించుకుంటున్నారు.
జనసేన గూటికి సంధ్యా విక్రమ్ కుమార్
కోడుమూరు నియోజకవర్గ నాయకుడు, వైసీపీ రాష్ర్ట కమిటీ సభ్యుడు సంధ్యా విక్రమ్ కుమార్ దాదాపు 12 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేశారు. 2024 ఎన్నికల ముందు మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, రాజకీయ ఓనమాలు నేర్చుకుని ప్రజాసేవ కోసం పరితపించిన యువ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్‌కు అధిష్టానం సీటు ఇస్తుందని ఆశించారు. అన్ని సర్వేలూ సంధ్యా విక్రమ్ కే టికెట్ అని తేల్చి చెప్పాయి. కానీ చివరి క్షణాల్లో ఊహించని విధంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్‌కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో టికెట్ రాలేదని సంధ్యా విక్రమ్ కుమార్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయినా అధిష్టానం సూచన మేరకు పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేశారు. అయినా టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి చేతిలో ఆదిమూలపు సతీష్ ఓటమి చెందారు. నాటి నుంచి నేటి వరకు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా సంధ్యా విక్రమ్ కుమార్‌కు ఎలాంటి సమాచారం ఇచ్చేవారు కాదు.
ప్రాధాన్యత లేదని..
2,41,767 మంది ఓటర్లున్న నియోజకవర్గంలో దాదాపు 40 నుంచి 50 వేల ఓటు బ్యాంకు కలిగిన సంధ్యా విక్రమ్ కుమార్ పార్టీలో తనకు ప్రాధాన్యత లేదనే ఉద్దేశంతో పార్టీ మార్పుపై ఈ నెల 26న కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అందుకు ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు కూడా ఆయన పార్టీ మార్పును ఏకీభవించారు. దీంతో ఆయన జనవరి 5న జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. వీటిపై నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.