- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంప్యూటర్, మైండ్ మాట్లాడుకుంటున్నాయి!
దిశ, వెబ్‌డెస్క్: కంప్యూటర్లతో, మన మెదళ్లు ఇప్పటికే హైటెక్ ల్యాబ్‌లలో ప్రతిరోజూ మాట్లాడుకుంటున్నాయి. కాగా, మనసులో ఊహించిన వాటినీ కంప్యూటర్లు చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్(బిసిఐ) టెక్నాలజీతో మైండ్ రీడింగ్ సాధ్యమేనని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’, మార్క్ జుకెర్ బర్గ్ ‘ఫేస్‌బుక్’ సంస్థలతో పాటు, ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఈ టెక్ సాయాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అసలు బిసిఐ అంటే ఏమిటి? దీంతో మైండ్ రీడింగ్ ఎలా సాధ్యం? ఇక్కడ తెలుసుకుందాం.
మెదడు..‘లింబిక్ సిస్టమ్’ ‘నియోకార్టెక్స్’ అనే భాగాలను కలిగి ఉండగా, మనుగడకు సంబంధించిన ప్రాథమిక కోరికల(తినడం, పునరుత్పత్తి)కు ‘లింబిక్ సిస్టమ్ బాధ్యత వహిస్తుంది’. ఇక నియోకార్టెక్స్.. మోస్ట్ ఆడ్వాన్స్ ఏరియా.. ఇది లాంగ్వేజ్, టెక్నాలజీ, బిజినెస్, ఫిలాసఫి వంటి లాజికల్ అంశాలకు రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. ఈ రెండు ప్రధాన భాగాలే కాకుండా, మానవ మెదడులో న్యూరాన్లుగా పిలిచే సుమారు 86 బిలియన్ నెర్వ్ సెల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఇవన్నీ ఆక్సాన్లు, డెండ్రైట్‌లు అని పిలువబడే కనెక్టర్ల ద్వారా ఇతర న్యూరాన్‌లతో అనుసంధానించబడి ఉంటాయి. సాధారణంగా ఏ పని చేసినా న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ క్రమంలో న్యూరాన్ నుంచి న్యూరాన్‌కు చిన్న విద్యుత్ సంకేతాలు ప్రయాణిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఆధారంగానే ‘బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ సాధ్యమవుతుంది. బిసిఐ ఈ సిగ్నల్స్‌ను డికోడ్ చేసి కంప్యూటర్‌కు కమాండ్స్ చేరవేస్తుంది.
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ రెండు విధాలు (ఇన్‌వేసివ్, నాన్ ఇన్‌వేసివ్). ఇన్‌వేసివ్ బిసిఐలో భాగంగా మానవ మెదడులో లేదా న్యూరాన్ల నిర్దిష్ట సెట్లలో సర్జరీ ద్వారా ఎలక్ట్రోడ్స్ లేదా స్పెషల్ డివైజెస్ అమర్చుతారు. ఇక నాన్ ఇన్‌వేసివ్ బిసిఐలో మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, రికార్డ్ చేయడానికి తలపై లేదా తల భాగానికి దగ్గరగా సెన్సార్ టూల్స్ అమరుస్తారు. వీటిని సులభంగా అమర్చొచ్చు, తీసేయచ్చు. ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (ఈఈజీ), మాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ(ఎమ్ఈజీ),ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎమ్ఆర్ఐ) వంటి టూల్స్‌ను ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఈ రెండింటిలో తక్కువ ఖర్చుతో పాటు, సురక్షితమైన విధానం నాన్-ఇన్‌వేసివ్ బిసిఐ. వీటి వాడకం చాలా పెరిగింది. స్టార్టప్ కంపెనీలు, పెద్ద టెక్ సంస్థలు ‘బ్రెయిన్ డేటా’ ఆధారంగా ఆదాయాన్ని సంపాదించడానికి దీన్నో నూతన మార్గంగా భావిస్తున్నారు. ఈ సాంకేతికతన బేస్ చేసుకుని న్యూ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్, న్యూ బిజినెస్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, దీని నుంచి లాభం పొందటానికి వ్యాపార దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్, స్పేస్ ఎక్స్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టాయి.
హెల్త్‌కేర్ విభాగంలో పార్కిన్సన్ వ్యాధిని తగ్గించడంలో, అంధులకు చూపు వచ్చే విషయంలో ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికి, మరెన్నో వ్యాధులను కనిపెట్టడంలో, క్యూర్ చేయడంలో ‘బిసిఐ’ ఉపయోగపడనుంది. అంతేకాదు మెదడు కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ద్వారా మెదడుతో నేరుగా స్మార్ట్ డోర్ లాక్స్ వంటి లింక్డ్ (IoT) పరికరాలను నియంత్రించొచ్చని యూఎస్ ఆర్మీ రీసెర్చ్ ఆఫీస్ పరిశోధనలో ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ఇటీవలి అధ్యయనంలో ఫ్రాన్స్, స్పెయిన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు భారతదేశం నుంచి ఫ్రాన్స్‌కు మెదడు సంకేతాలను ప్రసారం చేయగలిగారు. గేమింగ్, మార్కెటింగ్ సహా అన్ని రంగాల్లోనూ బిసిఐ కొత్త భాష్యం చెప్పనుంది.
టెక్నాలజీ వల్ల ప్రయోజనాలతో పాటు, నష్టాలు ఉంటాయి. ఈ క్రమంలో ఇన్‌వేసివ్ బిసిఐలో భాగంగా సర్జరీ చేసి ఎలక్ట్రోడ్స్ పెట్టాల్సి ఉంటుందని చెప్పుకున్నాం కదా, మరి ఇందుకు ఎవరు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు. ఒకవేళ ఇందుకు బలవంతంగా ఎవరినైనా ఒప్పించినా అది హ్యుమన్ ఎథిక్స్‌కు విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా కంపెనీలు మెదడు డేటాను ఉపయోగించడం, విశ్లేషించడం ప్రారంభిస్తే..గోప్యత, డేటా భద్రతకు ఎలా ప్రాధాన్యత ఇస్తారు? సేకరించిన డేటాను అంతిమంగా ఎవరు కలిగి ఉంటారు? ఆయా కంపెనీలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సందర్భంలో ఉద్యోగుల హక్కులు ఏవిధంగా ఉంటాయి? అమలు చేయాల్సిన విధానాలు ఏమిటి? అనే విషయంలో కంపెనీలు స్పష్టత ఇవ్వలేకపోయాయి. ఏదీ ఏమైనా సాంకేతికతను సమాజ ప్రయోజనాలకు ఉపయోగించాలి కానీ సంస్థ ఎదుగుదలకు కాకూడదని కంపెనీలు గ్రహించాలి.