వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ఉద్యోగుల ఓటు!

by Shyam |   ( Updated:2020-09-23 04:39:59.0  )
వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ఉద్యోగుల ఓటు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ పని అయినా కొత్తగా చేస్తున్నపుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినప్పటికీ కొద్దిగా కష్టపడి, మంచి ఫలితాలను రాబట్టుకోగలిగితే అదే పనిని కొనసాగించడానికి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. మార్చిలో కొవిడ్ లాక్‌డౌన్ ప్రారంభమైనపుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగే అవకాశం ఉన్న అన్ని కంపెనీలు ఆ విధానాన్ని పాటించాయి. అప్పటి నుంచి ఉద్యోగులందరూ తమ రోజువారీ పనితీరును మార్చుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి వీలైనంత కష్టపడ్డారు. కష్టకాలంలో తమ కంపెనీకి నిబద్ధతతో పనిచేశారు. చాలా ఇబ్బంది కూడా పడ్డారు. అందుకే మే మొదటివారంలో చేసిన సర్వేల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల రెండింతలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని, ఆఫీసుకి వెళ్లి పనిచేయడమే బాగుందని చెప్పారు. అలా చెప్పినవాళ్లే ఇప్పుడు మాట మారుస్తున్నారు. అసోచామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయమే బయటపడింది. ఇంతకీ ఏంటా విషయం?

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ నగరాల్లో ప్రైమస్ పార్టనర్స్ అనే సంస్థతో కలిసి ‘అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ ఒక సర్వే నిర్వహించింది. గతంలో ఆఫీసుకి వెళ్లి పనిచేసిన వాళ్లందరూ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడినట్లు ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా కొవిడ్ పూర్తిగా అంతరించిపోయిన తర్వాత కూడా తాము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని 75 శాతం మంది చెప్పారని ఈ సర్వే తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం ప్రజా రవాణా మీద నమ్మకం లేకపోవడమేనని వారు చెప్పారు. అంటే సొంతంగా వాహనం తీసుకుని వెళ్తే రోడ్డు మీద ట్రాఫిక్ పెరుగుతుంది, అలాగని ప్రజారవాణా వ్యవస్థను నమ్మలేం. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా అటు కంపెనీకి, ఇటు ఉద్యోగులకు లాభదాయకమేనని అసోచామ్ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడం వల్ల ప్రజారవాణా వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించడమే కాకుండా ఆపరేషన్ ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉందని కంపెనీలు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. అందుకే కొత్త నియామకాలకు కూడా పూర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed