- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఫీచర్స్ : కొలంబియాలోని ప్రధాన నదుల్లో ‘మాగ్డలీనా’ ఒకటి. ఈ నదీ ప్రాంతంలో హిప్పోపోటమస్ జంతువుల జనాభా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పర్యావరణంపై దుష్ర్పభావం పడకుండా ఉండాలంటే వీటిని చంపడమే ఉత్తమ మార్గమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అసలు విషయానికొస్తే.. హిప్పోపోటమస్ సంతతి పెరగడం వల్ల వచ్చే సమస్యలపై పరిశోధకులు చేసిన అధ్యయనం ఇటీవలే బయోలాజికల్ కన్జర్వేషన్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ కారణంగా మూడు దశాబ్దాలుగా కొలంబియా దేశం మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. మరి ఈ హిప్పోలకు, ఆ గ్యాంగ్‌స్టర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిప్పోల వల్ల కలుగుతున్న నష్టాలేంటి? ఆ విశేషాలు తెలుసుకుందాం.
1980-90 కాలంలో నటోరియస్ క్రిమినల్‌గా, డ్రగ్ మాఫియా లార్డ్‌గా పేరుగాంచిన పాబ్లో ఎస్కోబార్, కొలంబియాలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. అక్కడ కొకైన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే కాకుండా బాంబు దాడులు, హత్యలు, కిడ్నాప్‌లతో దేశంలో రక్తచరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఎస్కోబార్ ప్రపంచంలోనే వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో చేరగా.. కొలంబియా పోలీసులు 30 ఏళ్ల కిందటే అతడిని వేటాడి, వెంటాడి చంపేశారు. తను బతికున్నప్పుడే కొలంబియాకు ఎన్నో సమస్యలు తీసుకురాగా.. చనిపోయిన తర్వాత మరో పెద్ద సమస్య ఎదురవడం గమనార్హం.
ఎస్కోబార్‌కు ‘అటవీ జంతువులను’ పెంచుకోవడమంటే చాలా సరదా. ఈ మేరకు తన విలాసవంతమైన ‘హకీండా నేపోల్స్’ ఎస్టేట్‌లో కంగారులు, ఏనుగులు, జిరాఫీలు, వివిధ రకాల జంతువులతో పాటు హిప్పోలను కూడా పెంచుకునేవాడు. వీటిని ‘కొకైన్ హిప్పోలు’ అని పిలిచేవారు. అతడు చనిపోయిన తర్వాత, తన ‘ప్రైవేట్ జూ’ను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. అందులోని మూడు ఆడ హిప్పోలు, ఒక మేల్ హిప్పో మినహా మిగతా జంతువులన్నింటినీ దేశంలోని వివిధ జూలకు తరలించింది. హిప్పోలు చాలా బరువైనవి కావడం, వాటిని తరలించడం కూడా కష్టంతో కూడుకున్నపని కావడంతో అధికారులు వాటినే అక్కడే వదిలేశారు. అయితే అదే ఇప్పుడు సమస్యగా పరణమించింది
అక్కడే వదిలేసిన హిప్పోలు తమ సంతతిని భారీగా పెంచుకున్నాయి. ఈ క్రమంలో 2007 నాటికి 16 మాత్రమే ఉన్న హిప్పోలు.. 2014 నాటికి 40కి చేరుకోగా, ప్రస్తుతం 2,250 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 90 -120 మధ్య ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన 2034 కల్లా వీటి సంఖ్య 1,400కు చేరుకుంటుందని, రాబోయే కొన్ని దశాబ్దాల్లో వేలల్లో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి మెడెల్లిన్, బొగోటా మధ్య సారవంతమైన ప్రాంతంలో అభివృద్ధి చెందగా, ఇప్పుడు దేశంలోని ప్రధాన జలమార్గాల్లో ఒకటైన మాగ్డలీనా నదీ ప్రాంతంలోనూ వ్యాప్తి చెందుతున్నాయి. హిప్పోలను తినే జంతువులు కొలంబియాలో లేకపోవడం, ఆఫ్రికాలో ఉన్నవాటితో పోల్చితే కొలంబియాలోని హిప్పోలు తక్కువ వయసులోనే పిల్లల్ని కనడం వల్ల వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వెస్ట్ ఇండియన్ మనాటీ, నియోట్రోపికల్ ఓటర్, స్పెక్టకాల్డ్ కైమాన్, డాల్టోడ్-హెడ్ తాబేలు, మాగ్డలీనా నది తాబేలు వంటి అంతరించిపోతున్న జీవజాతులకు కూడా హిప్పోలు ముప్పుగా పరిణమిస్తున్నాయి.
కొలంబియాలో అధిక సంఖ్యలో ఉన్న హిప్పోల్లో కొన్నింటిని ఇప్పుడే చంపకపోతే.. మరో 10-20 ఏళ్లలో పరిస్థితి అదుపుతప్పుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని, హిప్పోల ఉనికి స్థానిక జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. హిప్పోల వల్ల నీటి వనరుల్లో రసాయన మార్పులు జరిగి చేపలకు కూడా నష్టం జరిగే అవకాశముందని వారు భావిస్తున్నారు. గతేడాది వెల్లడించిన మరొక అధ్యయనం ప్రకారం, హిప్పోలు.. తాము నివసించే సరస్సులలో పోషకాలు నశించి, సైనోబాక్టీరియా స్థాయిలు పెరగడానికి కారణమయ్యాయని, ఇది విషపూరిత ఆల్గే పెరగడానికి, ఆక్వా జంతుజాలం చనిపోవడానికి దారితీస్తుందని కనుగొన్నారు. హిప్పోలు స్థానిక జంతువులు కాకపోవడంతో వీటిని ఆక్రమణ జాతిగానే పరిగణించగా, ఎకో సిస్టమ్‌ను దెబ్బతీస్తున్న వీటిని చంపడమే సరైన మార్గమని శాస్త్రవేత్తలు నిర్ణయానికొచ్చారు. ఈ మేరకు ఏటా 30 హిప్పోలను చంపడం గానీ లేదా వాటికి సంతాన సామర్థ్యం లేకుండా గానీ చేయాలని వారు సూచిస్తున్నారు.
అనేక అధ్యయనాలు హిప్పోల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను సూచించినా, స్థానికుల్లో ఈ హిప్పోలు బాగా ప్రాచుర్యం పొందడం వల్ల కొలంబియన్ ఆర్మీ సైనికులు ‘పేపే’ అనే ఫెరల్ హిప్పోను 2009లో కాల్చి చంపినప్పుడు ప్రజాగ్రహానికి దారితీసింది. దాంతో ప్రభుత్వం వాటిని వేటాడటంపై నిషేధం విధించింది. అంతేకాదు పర్యాటకులను ఆకట్టుకోవడంలో హిప్పోలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని, పర్యాటకుల రాక పెరగడంతో తమ ఆర్థిక స్థితి మెరుగుపడిందని స్థానిక ప్రజలు అంటున్నారు. కొంతమంది నిపుణులు కూడా వాటిని తొలగించే ఆలోచనను వ్యతిరేకిస్తుండగా, ఎన్జీఓలు మాత్రం వీటిని హాని కలిగించే జాతిగా భావిస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పాటు హిప్పోలను చంపడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తుండటంతో కొలంబియా ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతోంది.