‘జానారెడ్డి’కి హ్యాండ్ ఇచ్చిన అధిష్టానం.. కారణం అదేనా.?

by Shyam |   ( Updated:2021-07-05 08:24:12.0  )
janareddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : కుందూరు జానారెడ్డి.. ఈయనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా తెలియని వారుండరు. ఆయన మాట్లాడే మాటలు ఒక పట్టాన అర్థం కాకపోయినా.. జానారెడ్డి మాత్రం అందరికీ సుపరిచతమే. సుదీర్ఘ కాలం పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించిన.. విశేషమైన రాజకీయ అనుభవం జానా సొంతం. ఒక్క నల్లగొండ జిల్లాకే కాదు.. యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఆయనను పెద్దదిక్కుగా చెబుతుంటారు. జానారెడ్డి గతమంతా వైభవోపేతమే.

కానీ, ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన పాత్ర తగ్గుతూ వస్తోంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూసినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల దృష్ట్యా ఉపఎన్నికలోనూ జానారెడ్డినే పార్టీ నిలబెట్టింది. నిజానికి జానారెడ్డి.. తన తనయుడు రఘువీర్ రెడ్డిని పోటీలోకి దించాలని చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డుకాలం పరిస్థితుల రీత్యా జానారెడ్డి పోటీలో నిలవడం.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేతిలో ఓటమి చవిచూడటం తెలిసిన సంగతి తెలిసిందే.

ఏ కమిటీలోనూ చోటు దక్కలే..

వాస్తవానికి తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం నాగార్జునసాగర్ ఉపఎన్నిక కంటే ముందే జరగాల్సి ఉంది. కానీ, ఆ ప్రభావం సాగర్ ఉపఎన్నిక మీద పడుతుందనే ఉద్దేశంతో పార్టీ హైకమాండ్‌కు జానా లేఖ రాయడంతో టీపీసీసీ ప్రకటన నిలిచిపోయింది. అయితే, తాజాగా టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలు కమిటీలను సైతం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ కమిటీల్లో ఏ ఒక్కదాంట్లోనూ జానారెడ్డికి ప్రాతినిధ్యం దక్కలేదు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉంటూ వస్తోన్న జానారెడ్డికి టీపీసీసీతో పాటు పలు కమిటీల్లోనూ చోటు కల్పించకపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జానా చరిష్మా కోల్పోయారా..

కాంగ్రెస్ సీనియర్ నేత, కురువృద్ధుడిగా పిలుచుకునే జానారెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించేవారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఏలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మల్చుకోవడంలో జానారెడ్డికి సిద్ధహస్తుడిగా పేరుంది. ప్రజల్లోనూ జానారెడ్డికి మంచి చరిష్మా ఉంది. అయితే, మారిన రాజకీయాలకు తోడు యువత ప్రభావం రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుండం వల్ల ప్రజల్లో జానారెడ్డి.. తన చరిష్మాను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. అయితే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా నియామకం కావడంతో కాంగ్రెస్ పార్టీలో జోరు పెరిగింది. ఆ జోరును జానారెడ్డి క్యాష్ చేసుకుని మరోసారి తన హవాను ప్రదర్శిస్తారా.. లేదా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తరహా పాత్రను కాంగ్రెస్ పార్టీలో పోషిస్తారా..? అన్న చర్చలేకపోలేదు. ఏది ఏమైనా జానారెడ్డి భవితవ్యం ఏంటనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

Advertisement

Next Story