కరోనా వేళ.. తల్లిపాలు పట్టడమే ఉత్తమం!

by Shyam |   ( Updated:2021-05-03 08:05:38.0  )
కరోనా వేళ.. తల్లిపాలు పట్టడమే ఉత్తమం!
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా కారణంగా వాస్తవాలేవో, అపోహలేవో తెలియడం లేదు. కొవిడ్ వల్ల ఎక్కువ మంది మరణిస్తున్న వేళ.. ఒక్క తప్పుడు సమాచారం వ్యాప్తిచెందినా ఎన్నో జీవితాలు బలయ్యే అవకాశముంది. ఈ క్రమంలో నెటిజన్లు సైతం తాము చదువుతున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రసవించిన మహిళలు.. కొవిడ్ బారిన పడితే తమ పిల్లలకు పాలు ఇవ్వవచ్చా? ఇది ఎంతవరకు క్షేమకరం? వంటి సందేహాలకు సమాధానమివ్వడంతో పాటు తల్లి పాల ప్రాముఖ్యత, శక్తిని బెంగళూరులోని ఫోర్టిస్ లా ఫెమ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, HOD డాక్టర్ శ్రీనాథ్ మణికంటి వివరించారు.

‘తల్లి పాలు.. నవజాత శిశువులు అనారోగ్యానికి గురికాకుండా కాపాడతాయి. వారి బాల్యమంతా శక్తివంతంగా ఉండటానికి సాయపడటంతో పాటు అంటువ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి తల్లి నుంచి నేరుగా సంక్రమించిన ప్రతిరోధకాలు కాబట్టి, వీటి వల్ల రోగనిరోధక శక్తి మరింత బలోపేతమై, శిశువులను అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. అంతేకాదు COVID-19 సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడే శక్తి కూడా లభిస్తుంది. కొవిడ్ సోకిన న్యూ మదర్స్.. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించడంతో పాటు కొన్ని సిఫార్సు చేసిన జాగ్రత్తలు పాటిస్తూ నిరభ్యంతరంగా శిశువులకు పాలు పట్టొచ్చు’ అని మణికంటి తెలిపారు. ఆరు నెలలు లేదా అంతకంటే తక్కువ వయసున్న బిడ్డలకు ప్రత్యేకంగా పాలివ్వాలని.. అదే ఆరు నెలలు దాటితే సురక్షితమైన, పరిపూర్ణక పోషకాలతో కూడిన ఆహారాన్నిస్తూ తల్లి పాలను కొనసాగించవచ్చని వెల్లడించారు.

కరోనా వైరస్ ప్రారంభ రోజుల నుంచి వివిధ దేశాల్లోని పరిశోధకులు COVID-19‌తో బాధపడుతున్న తల్లుల పాలను పరీక్షించారు. ఈ మేరకు ఇప్పటివరకు కూడా తల్లి పాల ద్వారా కొవిడ్ సోకుతుందనే ఆధారమైతే లేదు. కానీ కరోనా ఉంటే పాలిచ్చేటప్పుడు మాస్క్ ధరించాలి. బిడ్డను తాకే ముందు, ఆ తర్వాత సబ్బు నీటితో చేతులు కడుక్కోవాలి. పేషెంట్ తాకిన ఉపరితలాలను తుడిచి డిస్‌ఇన్‌ఫెక్ట్ స్ప్రే చేయాలి. వక్షోజాలను కడగడంతో పాటు శిశువును తల్లి మంచం నుంచి కనీసం 6 అడుగుల దూరంలో లేదంటే మరో గదిలో ఉంచడం శ్రేయస్కరం. ఇక తల్లి పాలు ఇవ్వనప్పుడు ఇతరులతో రొటీన్ బేబీ కేర్ చేయించాలి. ఒకవేళ బిడ్డ అనారోగ్యానికి గురైనా లేదా కొవిడ్‌తో బాధపడుతున్నా, తల్లి పాలను కొనసాగించడం ముఖ్యం.

Advertisement

Next Story

Most Viewed