ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది..?

by Anukaran |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది..?
X

దిశ ప్రతినిధి మహబూబ్‌నగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టతరంగా మారుతోంది.

రంగంలోకి అమాత్యులు..

ఇంతవరకు మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి విజయం సాధించని టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఈ స్థానం నుంచి విజయం సాధించాలనే తపనతో ఉంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌‌తో పాటు మరో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో మంత్రులు ఆయా నియోజకవర్గాలలో ముమ్మరంగా పర్యటిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలోకి భిన్నంగా ప్రచారాలు చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతోపాటు నిరుద్యోగులనుమచ్చిక చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోమారు కమల వికాసానికి బీజేపీ యత్నం

మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానం నుంచి మరోమారు గెలుపొందాలని భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును రంగంలోకి దింపింది. మరోమారు విజయం సాధించడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు వీలుగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. రామచంద్రకు మద్దతుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌డ్డి, తదితరులు అభ్యర్థి గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

రేస్‌లో కాంగ్రెస్

ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటిసారిగా కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తుంది. మాజీ మంత్రి చిన్నారెడ్డిని రంగంలోకి దించి ఎలాగైనా విజయం సాధించాలన్న తపనతో ముందుకు సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ శ్రేణులు తమ అభ్యర్థి గెలుపు కోసం విభేదాలను పక్కనపెట్టి అందరూ సమష్టిగా కృషి చేస్తున్నారు. పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, ఆలా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తమవంతుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికలలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు దీటుగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. టీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ గెలుపుపై ధీమాగా ఉన్నారు. వామపక్ష పార్టీలతోపాటు వాటి అనుబంధ సంస్థలు యూటీఎఫ్, తదితర సంఘాలు మద్దతు ఇస్తుండడంతో నాగేశ్వరరావు గెలుపు తనదే అంటున్నారు.

Advertisement

Next Story