ఇండియా 'బి' టీమ్‌లో ఎవరెవరు?

by Shyam |
ఇండియా బి టీమ్‌లో ఎవరెవరు?
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాలోని కీలక ఆటగాళ్లంతో ఇంగ్లాండ్ వెళ్లిపోతే.. శ్రీలంక పర్యటనకు ఎవరెవరు వెళ్తారనే చర్చ మొదలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి కీలక క్రికెటర్లు లేకుండా జట్టును ఊహించగలమా? వారు లేని జట్టు శ్రీలంక వెళ్లి విజయాలు సాధించగలదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. క్రికెట్ అభిమానులు ఒకవైపు శ్రీలంకకు ఏ జట్టు వెళ్తుందనే ఆందోళనలో ఉంటే.. భారీగా అందుబాటులో ఉన్న యువ క్రికెటర్లలో ఎవరిని ఎంపిక చేయాలా అని సెలెక్టర్లు టెన్షన్ పడుతున్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ వంటి టోర్నీలతో చాలా మంది యువ క్రికెటర్లు అందుబాటులోకి రావడంతో సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ ఇండియా మెయిన్ టీమ్‌కు ధీటుగా ఉండే టీమ్‌ను ఎంపిక చేయాలనుకుంటున్న సెలెక్టర్లకు కెప్టెన్ దగ్గర నుంచి అన్ని స్థానాలకు ఇద్దరు ముగ్గురు కనిపిస్తుండటం గమనార్హం.

బ్యాటింగ్‌లో వీళ్లకు చోటు?

టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఓపెనర్ శిఖర్ ధావన్ శ్రీలంక పర్యటనలో ఓపెనింగ్ చేయడం ఖాయమే. అయితే అతడికి జోడీగా ఎవరనే విషయంపై సందేహం నెలకొన్నది. పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రాణించారు. వీరిద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నది. ఇక టాపార్డర్, మిడిల్ ఆర్డర్‌లో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. వీరందరూ ఐపీఎల్‌లో సత్తా చాటిన క్రికెటర్లే. కేవలం టాప్ ఆర్డర్‌లోనే కాకుండా మిడిల్ ఆర్డర్‌లో కూడా తమ పాత్రను సమర్దవంతంగా పోషించగలరు. లోయర్ మిడిల్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ పాత్ర పోషించగలడు. అయితే ఇటీవల కాలంలో గాయం కారణంగా పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. కాగా, అదే స్థానంలో కృనాల్ పాండ్యా మరో ఛాయిస్ రూపంలో అందుబాటులో ఉన్నాడు. అయితే స్పిన్నర్ ఆల్‌రౌండర్ కంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఉంటేనే బాటుంటుందని సెలెక్టర్లు ఆలోచించే అవకాశం ఉన్నది. ఓపెనింగ్‌కు నాలుగైదు ఆప్షన్లు, మిడిల్ ఆర్డర్‌లో రెండు మూడు ఆప్షన్లు ఉన్నా.. ఆల్‌రౌండర్ స్థానానికే పెద్దగా ఆప్షన్లు కనపడం లేదు.

బౌలర్లే బౌలర్లు..

శ్రీలంక పిచ్‌లకు సరిపోయే బౌలింగ్ వేసే సత్తా కలిగిన యువ బౌలర్లు చాలా మంది ఉన్నారు. సెలెక్టర్ల ముందు పేసర్లు, స్పిన్నర్లు కలిపి 20 మంది వరకు కనపడుతున్నారు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు జోడీగా బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. దీపక్ చాహర్, జయదేవ్ ఉనత్కత్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, హర్షల్ పటేల్, చేతన్ సకారియాలు ఉన్నారు. వీరిలో ఉనద్కత్, సైనీ, ఖలీల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నది., అయితే ఇటీవల హర్షల్ పటేల్, చేతన్ సకారియాలు ఐపీఎల్‌లో మంచిగా ప్రభావం చూపించారు. భువనేశ్వర్ కుమార్‌కు సరైన జోడి నవదీప్ సైనీ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నవదీప్ సైనీ మంచి పేస్ రాబట్టడంతో పాటు స్వింగ్ చేయగలడు. కాగా, భువనేశ్వర్ కుమార్ అప్పటిలోగా పూర్తి ఫిట్‌నెస్ సాధించగలడా లేదా అనేది అనుమానం.

యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి రూపంలో నాలుగు స్పిన్నింగ్ ఆప్షన్లు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ తప్ప మిగిలిన ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న వాళ్లే. కుల్దీప్, చాహల్ జోడీ ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగి రెండేళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వారిద్దరినే ఎంపిక చేస్తారా లేదో మరో యువ స్పిన్నర్‌కు చాన్స్ఇస్తారా అనేది చూడాలి. మొత్తానికి అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సెలెక్టర్ల ముందు భారీ ఆప్షన్లు ఉన్నాయి. వీరి నుంచి సరైన క్రికెటర్లను ఎంపిక చేస్తే టీమ్ ఇండియా బి టీమ్ కూడా శ్రీలంకకు గట్ట పోటీని ఇవ్వగలదు.

Advertisement

Next Story