- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకాంగ్రెస్‌లో తెగని పంచాయితీ
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ పంచాయితీ తెగడం లేదు. ఉత్తమ్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్పదవి ఎవరిని వరిస్తుందనే సందిగ్ధం ఇంకా వీడటం లేదు. వాస్తవంగా మంగళవారమే టీపీసీసీ కొత్త చీఫ్ప్రకటన ఉంటుందని, నేడు బాధ్యతలు తీసుకుంటారని భావించారు. కానీ ఆశావహులు పెరుగుతుండటం, అధిష్ఠానం దగ్గర పైరవీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మళ్లీ క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈసారి ఈ బాధ్యతలను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు అప్పగించింది. దీంతో ఆయన మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. గాంధీభవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో టీపీసీసీ చీఫ్ ఎవరికివ్వాలనే అంశంపై పరిశీలన చేయనున్నారు. ఈ నెల 12న అధిష్ఠానానికి నివేదిక సమర్పించిన తర్వాత అదే రోజు లేకుంటే మరునాడు కొత్త చీఫ్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పోటాపోటీ ప్రయత్నాలు
టీపీసీసీ నూతన అధ్యక్షుడి పదవి కోసం ఆశావహులూ పెరుగుతున్నారు. కాంగ్రెస్‌లో టీపీసీసీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు అధ్యక్షులయ్యే వాళ్లు 2023 సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగే అవకాశం ఉండడంతో పోటీ పెరిగింది. నేతలు ఓ వైపు ప్రయత్నాలు చేసుకుంటూనే మరోవైపు పోటీదారులపై విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రేసులో ముందున్నారు. ముందు నుంచీ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేసులో సీరియస్‌గా ఉన్నానని, సమయం ఇస్తే రాహుల్‌నూ కలిసి నివేదిస్తానంటూ చెబుతున్నారు. అయితే పార్టీ పట్ల విధేయత, పార్టీలోనే సీనియార్టీ ఉన్న నేతలనే ఎంపిక చేయాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం వద్దంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల్లో తొందరపాటు ఉన్న నేతలకు అప్పగించొద్దంటూ సూచిస్తున్నారు. దీంతో తెరపైకి మళ్లీ సీనియర్లు జానారెడ్డి, చిన్నారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిని కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల అంశాలను కూడా తీసుకుంటున్నారు.
ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికే టీపీసీసీ, గత అసెంబ్లీలో సీఎల్పీ పదవులు ఇచ్చి చేసిన ప్రయోగం విఫలమైందని, ఈసారి టీపీసీసీ అధ్యక్ష స్థానం తమకే ఇవ్వాలని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. పీసీసీ మాజీ చీఫ్‌లు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ కూడా తమవంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఆశావహుల జాబితాల్లోకి వచ్చారు. ఒకవేళ తాజా సమీకరణాలన్నీ అనుకూలిస్తే తమకే పదవి వరిస్తుందన్న అంచనాలతో ఎస్సీ వర్గం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులున్నారు. నేతలు ఒక్కొక్కరుగా టీపీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో కాంగ్రెస్‌పార్టీలో ప్రతి ఒక్కరు పీసీసీ చీఫ్‌కు అర్హుడే అంటూ నేతలు చర్చించుకుంటున్నారు.
ఎవరైతే బాగుంటుందో..?
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నేటి నుంచి మళ్లీ క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను సేకరించనుంది. బుధవారం ఉదయం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్‌కు వచ్చి, గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్ కమిటీ అభిప్రాయాన్ని తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 10, 11 తేదీల్లో పార్టీలోని వివిధ వర్గాలు, కొంతమంది స్థానికంగా.. జిల్లా నేతల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 12న ఢిల్లీ వెళ్లి అధిష్ఠానానికి నివేదిక సమర్పిస్తారని, ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ప్రకటన వస్తుందని సమాచారం.
సర్వేలో రేవంత్‌కే ఎక్కువ ఓట్లు
ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బతింది. వరుస వైఫల్యాలను మూటగట్టుకుంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదవి భారమని ఉత్తమ్ వదిలేశారు. వాస్తవంగా హుజూర్‌నగర్ ఉపఎన్నిక తర్వాత నుంచే ఉత్తమ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. ఢిల్లీలో కోర్ కమిటీకి కూడా రాజీనామా లేఖ ఇచ్చారు. కానీ రెండేండ్ల నుంచి కొత్తవారిని ఎంపిక చేయకుండా కొనసాగిస్తున్నారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ మరింత దిగజారింది. దీంతో ఉత్తమ్ మరోసారి రాజీనామా లేఖను సమర్పించారు. కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాలంటూ అధిష్ఠానానికి పంపించారు. ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ సమయంలో టీపీసీసీ చీఫ్ మార్పు అనివార్యంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడ్డారు. కానీ కొంతమంది సీనియర్లు మాత్రం ఆయనకు అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా గతంలో లేని విధంగా పలు ఏజెన్సీలతో కూడా సర్వే చేయిస్తున్నారు. ఓ సర్వేలో టీపీసీసీ చీఫ్ కోసం పోటీ పడే నేతలపై సర్వే చేయించారు. మూడు రోజుల్లో ఈ సర్వేలో మొత్తం 5.22 లక్షల ఓట్లు పోలయ్యాయి. దీనిలో ఎంపీ రేవంత్‌రెడ్డికి మద్దతుగా 4.07 లక్షలు రాగా కోమటిరెడ్డికి 67 వేలు, శ్రీధర్‌బాబుకు 20 వేలు, భట్టి విక్రమార్కకు 26 వేల ఓట్లు వచ్చాయి. ఇవి కూడా అధిష్ఠానానికి పంపించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.