ఆనంద గజపతి రాజు వారసులెవరు?.. సంచైతా? ఉర్మిళా?

by srinivas |
ఆనంద గజపతి రాజు వారసులెవరు?.. సంచైతా? ఉర్మిళా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు గజపతి వంశీయులు పాలించారు. అప్పటి నుంచి గజపతుల వంశానికి ఉత్తరాంధ్రలో ఒక ప్రతిష్ఠ ఉంది. గజపతుల వంశంలో అశొక్ గజపతి రాజు, ఆనంద గజపతి రాజులకు కుమార్తెలు కావడంతో వారసుల మధ్య వారత్వ సమస్య పుట్టుకొచ్చింది.
నిన్నమొన్నటి వరకు లేని వారసత్వ సమస్య సంచైత గజపతి రాజు సింహాచలం దేవస్థానం ఛైర్మన్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ అయినప్పటి నుంచి వివాదాస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో వాస్తవానికి పూసపాటి ఆనంద గజపతిరాజు వారసులం మేమని, సంచైత గజపతి రాజు కాదని ఆయన భార్య సుధా గజపతి రాజు, కుమార్తె ఉర్మిళ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం
రేపుతున్నాయి. ఇంతకీ ఆనందగజపతి రాజు వారసులెవరు? అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.

ఆనంద గజపతి రాజు కుమార్తెనని, ఆయన వారసురాలినని సంచైత గజపతి రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనంద గజపతి రాజు వారసులం తామేనని, వారసత్వ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామంటూ ఆయన భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతి రాజు చెబుతున్నారు. సంచైత అసలు వారసురాలు కానే కాదని పేర్కొన్నారు. ఆనంద గజపతిరాజు వారసురాలినని చెప్పుకుంటున్న ఆమె అందుకు సంబంధించి ఒక్క ఆధారాన్నైనా చూపించగలరా? అని వారు ప్రశ్నించారు.

చెన్నైలోని ఓ ఆస్తి విషయంలో తాము సంతకాలు ఫోర్జరీ చేశామంటూ గతేడాది మేలో సంచైత తమపై విశాఖలో కేసు పెట్టారని, తమకు నోటీసులు అందడంతో లండన్ నుంచి ఇక్కడకు వచ్చామని చెబుతున్నారు. సంచైత తల్లి ఉమా గజపతిరాజు 1991లోనే ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకుని వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి పంపకాలు కూడా పూర్తయ్యాయని వారు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆస్తులన్నీ తమకే చెందేలా తన తండ్రి స్వహస్తాలతో వీలునామా రాశారని, అది తమ వద్ద భద్రంగా ఉందని ఊర్మిళ తెలిపారు.

దీనిపై హైకోర్టు న్యాయవాది హరికృష్ణ మాట్లాడుతూ, వాస్తవానికి ఆనంద గజపతి రాజు నుంచి వారసత్వంగా సంచైతకు దక్కిన ఆస్తులను ఆమెకు వివాహం కాకుండా విక్రయించకూడదన్న నిబంధన ఆస్తి పత్రాల్లో స్పష్టంగా రాసి ఉందని అన్నారు. దానిని పక్కన పెట్టి ఆస్తుల్ని విక్రయించడం చట్ట విరుద్ధమని తెలిపారు.
అంతేకాకుండా, చెన్నైలో జరిగిన ఘటనను విశాఖలో జరిగినట్టు చెప్పి కేసు పెట్టారని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed