- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త సవాల్.. కేటీఆర్ టీమ్‌లో ఉండేదెవరు?
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దాలన్న అంశంలో కేసీఆర్‌కు ఒక లెక్క ఉంది. ఇప్పుడు ‘బంగారు తెలంగాణ’ దిశగా సాగుతున్న ప్రయాణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే కేటీఆర్‌కు ఇంకో లెక్క ఉంటుంది. దానికి అనుగుణంగానే ‘మంత్రివర్గ’ సైన్యాన్ని తయారుచేసుకోక తప్పదు. ఆరున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ‘రైతుబంధు’, ‘రైతుబీమా’, కాళేశ్వరం ప్రాజెక్టు, ‘మిషన్ భగీరథ’, ‘కల్యాణలక్ష్మి’ ఇలా అనేక పథకాలతో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కేటీఆర్ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా తనకంటూ ఒక టీంను, ఆలోచనా విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం అనివార్యం. దానికి తగినట్లుగానే మంత్రివర్గ కూర్పు ఉంటుందనేది ఆయన సన్నిహితుల సమాచారం.
ఇప్పుడున్న మంత్రివర్గం అలాగే కొనసాగుతుందా లేక కొద్దిపాటి మార్పులు మాత్రమే చేస్తారా లేక పూర్తిగా తన అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే సమర్ధులకు అవకాశం ఇస్తారా.. ఇలా అనేక అంశాలు కేటీఆర్‌కు సన్నిహితంగా ఉన్నవారిలోనే చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఆలోచనలను, వేగాన్ని అందిపుచ్చుకునేవారికి ప్రయారిటీ ఉంటుందని, అదే సమయంలో యువతరం, ఆయా అంశాలపై తగిన అవగాహన ఉన్నవారికి అవకాశాలు ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. అనుభవం, అవగాహన కీలక అంశాలేనని, రెండింటి మేళవింపుగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఆ ప్రకారం ఇప్పుడున్న మంత్రివర్గంలో వివిధ అంశాలపై అవగాహన ఉన్నవారు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
కీలకమైన శాఖలపైనే ఫోకస్
ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణ పరిపాలనతో పాటు రెవెన్యూ, సాగునీటి పారుదల తదితర ముఖ్యమైన శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు. వీటితో పాటు ఆర్థికం, విద్య, వైద్యం, పరిశ్రమలు కూడా కీలకమైనవే కావడంతో సమర్ధులైనవారికి అప్పజెప్పడం లేదా ఇప్పుడు నిర్వహిస్తున్నవారికే కొనసాగిస్తూ తనదైన శైలిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో రాష్ట్రానికి గడచిన ఆరున్నరేళ్లలో జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు తరహాలోనే రానున్న కాలంలో కూడా అదనపు గుర్తింపు వచ్చేలా పరిపాలనను కొత్త పుంతలు తొక్కించే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం వినూత్నమైన కొన్ని పథకాలకు ఇప్పటికే ఆలోచన చేసినట్లు తెలిసింది.
అన్నిటిని పరిగణనలోకి తీసుకుని
మంత్రిత్వశాఖల నిర్వహణలో అనుభవం, అవగాహన, తగిన విద్యార్హతలను కూడా కేటీఆర్ పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. మంత్రివర్గంలో మొత్తం యువతరమే ఉంటారని భావించాల్సిన అవసరం లేదని, వయోధికులు కూడా సముచిత స్థానాలలో ఉంటారని ఒకరు తెలిపారు. సన్నిహితంగా ఉంటున్నవారిలో చాలా మంది మంత్రిపదవులు వస్తాయని ఆశిస్తున్నా దాన్ని ప్రామాణికంగా తీసుకుని అవకాశాలు కల్పించాలన్న ఆలోచన లేదని, వారి సేవలను మరో రకంగా వినియోగించుకోడానికి, వారి ఆకాంక్షలను వేరే తీరులో సంతృప్తిపర్చడానికి మార్గాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. దీన్నే వారికి అర్థం చేయిస్తారని సన్నిహితులు పేర్కొన్నారు.
ఆశావహుల ఎదురుచూపులు
కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని, ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి సమర్థుడేనని చాలా కాలంగా బహిరంగంగా ప్రశంసలు కురిపించినవారంతా ఇప్పుడు ఆయనతో కలిసి మంత్రివర్గంలో పనిచేయాలని కోరుకుంటున్నారు. ప్రతీ జిల్లాలోనూ నలుగురుదైగురు చొప్పున ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లాంటివారు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ అహ్మద్, జీవన్‌రెడ్డి తదితరులంతా మంత్రివర్గంలో చోటు లభించాలని కోరుకుంటున్నవారే. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జోగురామన్న, కేపీ వివేకానంద్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి చాలా మందికి అవకాశాలు లభిస్తాయని, వీరంతా కేటీఆర్‌కు బాగా సన్నిహితులన్న ప్రచారం జరుగుతోంది.
అప్పుడే విధేయులుగా మారి
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడంతోనే చాలా మంది ఆయనకు విధేయులుగా మారిపోయారు. భవిష్యత్తులో ఎప్పటికైనా సీఎం అవుతారనే అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఆప్పటి వరకూ కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటున్నవారంతా కేటీఆర్‌తోనూ అంతే సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. గడచిన రెండేళ్ళలో ఆయనకు దగ్గరైనవారు చాలా మందే ఉన్నారు. వారందరినీ ఆ సన్నిహితత్వంతో మంత్రివర్గంలో పెట్టుకునే అవకాశాలు లేవు. పరిమిత సంఖ్యలో ఉండే మంత్రివర్గంలోకి వారందరినీ తీసుకునే అవకాశం అంతకంటే లేదు. ఆకాంక్షల సంగతి ఎలా ఉన్నా ఆప్షన్లు మాత్రం చాలా పరిమితం. దీంతో ఆశావహుల్లో తలెత్తే అసంతృప్తిని చల్లార్చడం, అర్థం చేయించడం కేటీఆర్‌కు అసలైన సవాలు.
జిల్లా, కుల సమీకరణాలూ ప్రధానమే
కేటీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాగూ కొత్త మంత్రివర్గం కొలువుతీరాల్సిందే. అయితే ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నవారిలో ఎవరెవరికి ఉద్వాసన ఉంటుంది, కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందన్నదానిపైనే పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. కేసీఆర్ పనితీరుకు, కేటీఆర్ పనితీరుకు సహజంగా తరాల అంతరంతో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు వ్యత్యాసం ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి ఎసరు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ అనేక కోణాల నుంచి ఆలోచించి మంత్రులుగా అవకాశం ఇచ్చినా వారితో పనిచేయించుకోడానికి ఉద్యమ నేతగా, రాజకీయ అనుభవజ్ఞుడిగా కొన్ని లెక్కలున్నాయి. కానీ కేటీఆర్ విషయంలో ఆ ప్రాధాన్యతలు, ప్రామాణికాలు వేరుగా ఉండే అవకాశం ఉంది.
సామాజికవర్గాలూ ప్రధానమే
జిల్లాలు, సామాజికవర్గాలు, విద్యార్హతలు, అనుభవం, అవగాహన, చురుకుదనం, ఆలోచనలు.. ఇలా అనేక అంశాలను కేటీఆర్ పరిగణనలోకి తీసుకుంటారనే టాక్ మొదలైంది. ఏయే జిల్లాలకు ఇప్పుడు ఏ మేరకు ప్రాధాన్యం ఉంది, అందులో సామాజికవర్గాల కూర్పు ఎలా ఉందో తెలిసిందే. కొత్త మంత్రివర్గంలోనూ ఆ ఫార్ములా తప్పనిసరి కానుంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా నుంచి గత టర్మ్‌లో (తుమ్మల నాగేశ్వరరావు)గానీ, ఇప్పుడు (పువ్వాడ అజయ్)గానీ ఒక్కరే మంత్రి ఉన్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశాలు ఉంటాయని, కేటీఆర్ నుంచి ఆ మేరకు భరోసా లభించిందని చర్చ జరుగుతోంది. ఆ జిల్లాలో ఒక్క స్థానంలో మాత్రమే గెలిచినందున రెండు మంత్రి పదవులు ఉండకపోవచ్చని, ఎవరిని ఎంపిక చేసుకుంటారన్నది అస్పష్టంగానే ఉంది.
సమతుల్యం సవాలే
ఇలాంటి అనేక సందేహాలు ఉన్న పరిస్థితులలో జిల్లాల, సామాజికవర్గాల మధ్య సమతుల్యం పాటించడం కీలకంగా మారనుంది. బీజేపీ ఒకవైపు మతం, మరోవైపు నిర్దిష్ట సామాజికవర్గంతో బలపడాలని భావిస్తున్న సమయంలో ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం టీఆర్ఎస్‌కు అనివార్యంగా మారింది. ఏక కాలంలో అభివృద్ధి, సంక్షేమం రైలు పట్టాల తరహాలో ఆరున్నరేళ్ల పాటు జరిగిన తెలంగాణ ప్రయాణంలో కరోనా తర్వాతి పరిస్థితులలో చాలా తేడా వచ్చింది. సాగునీటిపారుదల రంగం తప్ప అన్ని రకాల అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. సంక్షేమాన్ని పకడ్బందీగా అమలుచేయడంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2018లో ఇచ్చిన అనేక హామీలు ఇంకా అమలులోకి రాలేదు. వీటిని అమలుచేయాలంటే ఆర్థిక వనరులు అవసరం. ఇప్పటికే రెండేళ్లకాలం గడచిపోయింది. రానున్న మూడేళ్లలో ఆ హామీలను అమలుచేసి పూర్తిచేయడం కేటీఆర్‌కు తొలి ప్రాధాన్యంగా మారింది. ఈ ఆలోచనలకు అనుగుణంగా తనదైన టీమ్‌ను తయారు చేసుకుని పాలన సాగించడం కేటీఆర్ ముందుండే తక్షణ కర్తవ్యాలు. తన ప్రయారిటీకి అనుగుణంగా ఎవరికి స్థానం కల్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరికొన్ని వారాలలో ఈ సందేహాలకు, అంచనాలకు సమాధానాలు లభిస్తాయి.