ఆ పేషెంట్లు ఎక్కడ..? అసలు గాంధీలో ఏం జరుగుతోంది..?

by Shyam |
ఆ పేషెంట్లు ఎక్కడ..? అసలు గాంధీలో ఏం జరుగుతోంది..?
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి నాటికి మొత్తం 1771 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రికి మాత్రం కేవలం 247 మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది. కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండేలా 310 మందిని డిశ్చార్జి చేసి ఇండ్లకు పంపించామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. మరో 83 మందికి ఇంటి దగ్గర ఆ సౌకర్యం లేకపోవడంతో వారిని అమీర్‌పేట్‌లోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్టు వివరించారు. మొత్తంగా సోమవారం 393 మంది గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి వెలువడిన ప్రకటన ప్రకారం కేవలం 247 మంది మాత్రమే ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొనడంతో మిగిలిన 1131 మంది కరోనా పేషెంట్లు ఏమయ్యారన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా విషయంలో ప్రభుత్వం వెల్లడిస్తున్నగణాంకాలు తొలి నుంచీ అనుమానాలను పెంచుతున్నాయి.

సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, సీఎం కార్యాలయం ఇచ్చిన వివరణలను చూసిన తర్వాత కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రాత్రి నాటికి మొత్తం 3,650 మంది కరోనా బారిన పడితే, ఇందులో 1,742 మంది డిశ్చార్జి కాగా, 137 మంది మృతిచెందారు. ఇంకా 1,771 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందించే ఏకైక ప్రభుత్వాస్పత్రి గాంధీ మాత్రమేనని రెండు రోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పేదవారైనా, సంపన్నులైనా కరోనా సోకితే గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సిందేనని గత నెల మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యానించారు. దీంతో కరోనా పేషెంట్లంతా గాంధీ ఆస్పత్రిలో చేరడం మినహా మరో ఆస్పత్రిలో చికిత్స పొందే అవకాశమే లేదని స్పష్టమవుతోంది. 1,771 మంది పేషెంట్లలో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఉన్న 247 మంది, పాజిటివ్ ఉన్నప్పటికీ ఇండ్లలోనే ఉండడానికి సిద్ధపడి డిశ్చార్జి అయిన 310 మంది, అమీర్‌పేట్‌లోని ప్రకృతి చికిత్సాలయానికి వెళ్లిన 83 మంది మినహా మిగిలిన 1,131 మంది ఎక్కడున్నారనేది అంతుచిక్కని రహస్యంగా మిగిలింది.

ఒక్క పాజిటివ్ పేషెంట్ రోడ్డు మీదకు వస్తే వందలాది మందికి వ్యాధి అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించే ప్రభుత్వం ఇప్పుడు ఈ 1,131 మంది విషయంలో మాత్రం సమాధానం ఇవ్వలేదు. వీరిని డిశ్చార్జి చేశారా? లేక ఇండ్లకు పంపారా? లేక మరో ఆస్పత్రికి తరలించారా? లేక ఆస్పత్రి నిర్వాహకులకు తెలియకుండా రోడ్డుపైకి వచ్చారా? లేక ఇంతకాలం లెక్కల్లోనే ఉన్నారే తప్ప భౌతికంగా వారు లేరా…? ఇలాంటి అనేక సందేహాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఒక్కరోజు వ్యవధిలోనే 1,131 మంది పేషెంట్ల విషయంలో సందేహాలకు తావిచ్చే తీరులో ప్రభుత్వ అధికారుల నుంచి ప్రకటనలు వెలువడడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతూ ఉన్న సమయంలో ఇలాంటి సందేహాలను ప్రభుత్వం కలిగించడం గమనార్హం. నిజానికి సందేహాలను నివృత్తి చేసే తీరులో ప్రభుత్వం నుంచి వివరణ రావాల్సి ఉండగా మరిన్ని అనుమానాలకు తావిచ్చే తీరులో వేర్వేరు ప్రకటనలు విడుదలవుతున్నాయి.

Advertisement

Next Story