వాట్సాప్‌లో.. రోజుకు 100 కోట్ల కాల్స్

by Sujitha Rachapalli |
వాట్సాప్‌లో.. రోజుకు 100 కోట్ల కాల్స్
X

దిశ, ఫీచర్స్ : 12 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 25న.. మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఈ ప్రపంచానికి పరిచయమైంది. అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ బ్రయాన్ యాక్టన్, ఉక్రెయినన్ అమెరికన్ బిలియన్ ఎంటర్‌ప్రెన్యూర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ జాన్ కౌమ్ ఆలోచనల నుంచి వాట్సాప్ ప్రారంభమైంది. మొదట్లో వాట్సాప్‌ని ఉపయోగించాలంటే కొంత ఫీజు వసూలు చేసేవారు, కానీ తర్వాత కాలంలో వాట్సాప్‌ను ఫ్రీ సర్వీస్‌గా మార్చారు. 2009 నవంబర్‌లో మొదట ఐవోఎస్‌లో, ఆ తర్వాత 2010 మే నెల‌లో సింబియన్ ఓఎస్, 2010 ఆగస్టు‌‌లో ఆండ్రాయిడ్ వెర్షెన్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్ స్వల్పకాలంలోనే ప్రపంచవ్యాప్త యూజర్లను ఆకట్టుకోగా, 2014లో ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు (రూ.1.18 లక్షల కోట్లు) వెచ్చించి ఈ సంస్థను కొనుగోలు చేయడం విశేషం. టెక్ట్స్ మెసేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్‌, ఫొటోలు, పేమెట్స్.. ఇలా ఎన్నో ఫీచర్స్ అందిస్తూ అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్‌గా రూపాంతరం చెందిన వాట్సాప్‌ను వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలోనే వాట్సాప్ పన్నేండేళ్లు పూర్తి చేసుకోగా, ఇన్నేళ్లలో సంస్థ సాధించిన విజయాలను తెలియజేస్తూ 12వ వార్షికోత్సవాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా తమ మెసేజింగ్ యాప్ ద్వారా సెండ్ అవుతున్న మెసేజ్‌లు, వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్ గణాంకాల‌ను పంచుకుంది.

పుష్కర కాలంలో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజ‌ర్లను సొంతం చేసుకున్న వాట్సాప్‌లో ప్రతి నెలా 10 వేల కోట్ల మెసేజ్‌లు సెండ్ అవుతున్నాయి. అంతేకాదు రోజుకు 100 కోట్ల కాల్స్ కూడా వాట్సాప్ నుంచి వెళ్తుండ‌టం విశేషం. 2015 ఫిబ్రవరిలో వాయిస్ కాలింగ్, 2016 నవంబర్‌లో వీడియో కాలింగ్‌ సేవలను విస్తరించిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్.. 2018 ఆగస్టులో గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చింది. కాగా యూజ‌ర్ల ప్రైవ‌సీకి ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉంటామ‌ని వాట్సాప్ మ‌రోసారి స్పష్టం చేసింది. త‌మ ప్లాట్‌ఫామ్‌పై ఎప్పటికీ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంద‌ని కూడా తేల్చి చెప్పింది. ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ డౌన్‌లోడ్స్ ఈ జనవరి వరకే ఐదు బిలియన్లకు చేరుకున్నాయి. కాగా ఈ మైలురాయిని సాధించిన సెకండ్ నాన్ గూగుల్ యాప్ వాట్సాప్ మాత్రమే.

Advertisement

Next Story

Most Viewed