- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా నియంత్రణ కంటే ఎన్నికలే ట్రంప్ టార్గెట్?
దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా అమెరికా దేశంలో ప్రవేశించిన నాటి నుంచే వేగంగా విస్తరిస్తూ భారీ ప్రాణనష్టం కలిగించింది. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు ఏం చేయాలో పాలు పోని స్థితికి చేరుకుంది. ముఖ్యంగా వాణిజ్య రాజధాని న్యూయార్క్ కరోనా కేంద్రంగా మారి లక్షలాది మందికి సోకింది. ఇప్పటి వరకు అమెరికాలో 11.6 లక్షల కరోనా కేసులు నమోదైతే కేవలం న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లోనే 4.5 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నారంటే ఈ రెండు నగరాల్లో కరోనా సృష్టించిన విలయాన్ని ఊహించుకోవచ్చు. అమెరికాలో జనవరి 19న తొలి కేసు నమోదైంది. న్యూయార్క్‌లోని ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో ఒక క్లీనిక్‌కు వచ్చాడు. అతని ప్రయాణ చరిత్రను చూడగా వూహాన్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వచ్చినట్లు తెలుసుకున్నారు. అప్పటికే ఆ వ్యక్తి ద్వారా పలువురికి వ్యాధి సోకింది. చూస్తుండగానే న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదవడమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకు పాకింది.
అధ్యక్షుడి నిర్లక్ష్యం..
దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా కేసులు పెరిగిపోవడంతో వెంటనే లాక్‌డౌన్ అమలు చేయాలని నిపుణులు అధ్యక్షుడు ట్రంప్‌నకు సూచించారు. కానీ, ట్రంప్ ఈ మాటలను అసలు పట్టించుకోలేదు. కరోనా ఏమీ చేయలేదంటూ ప్రగల్భాలు పలికారు. మీడియా సైతం ఈ విషయంలో ట్రంప్‌పై దుమ్మెత్తిపోశాయి. రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడంతో రాష్ట్రాల వారీగా షట్‌డౌన్ చేసుకుంటూ వచ్చిన ఫెడరల్ ప్రభుత్వం చివరకు ఏప్రిల్ రెండో వారంలో కానీ దానిని జాతీయ విపత్తుగా ప్రకటించలేదు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా రికార్డులకెక్కింది. అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యం కారణంగానే కరోనాకు అమెరికన్లు బలికావల్సి వస్తోందని అన్ని వైపుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. సరైన సమయంలో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించకుండా.. తాత్సారం చేస్తూ వచ్చారంటూ ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికే ట్రంప్ చైనాపై కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో తనపై పెరిగిపోతున్న విమర్శలకు సమాధానం చెప్పలేక.. ‘చైనా వైరస్’ అనే పదాన్ని ముందుకు తెచ్చారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మీడియా సమావేశాల్లో కూడా కరోనా కట్టడిపై ట్రంప్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే ఆయా రిపోర్టర్లపై చిందులు తొక్కడం మొదలు పెట్టారు. ప్రతీసారి చైనా, డబ్ల్యూహెచ్‌వోను విమర్శిస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
లాక్‌డౌన్ రాజకీయం..
కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పలు దేశాల్లో రాజకీయాలు మాత్రం ఆగలేదు. కరోనా లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి అమెరికా రాజకీయ నాయకులు కూడా అతీతం కాదు. లాక్‌డౌన్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయిన విషయం వాస్తవం. చిన్న వ్యాపారాల నుంచి బడా కంపెనీల వరకు అన్నీ మూతపడటంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. మరోవైపు కరోనా కోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరో ఆరు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవన్నీ ట్రంప్‌నకు ఇబ్బందికరంగా మారాయి. కరోనాకు వ్యాప్తికి తన నిర్లక్ష్యమే కారణమంటూ విమర్శలు రావడం, అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగ రేటు పెరిగిపోవడం ఎన్నికల్లో తనకు ప్రతికూలంగా మారుతుందని భయపడ్డారు. దీంతో ఏప్రిల్ చివరి వారంలో 464 బిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీపై ట్రంప్ సంతకం చేశారు. చిన్న పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి, ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి, ఔషధాలు, పరికరాల కొనుగోలుతో పాటు టెస్టింగ్స్ కోసం ఈ నిధులు ఉపయోగించాలని ట్రంప్ నిర్ణయించారు. మరోవైపు లాక్‌డౌన్ ఎత్తేసి అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని భావించారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల గవర్నర్లపై ఒత్తిడి తెచ్చారు. అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన గవర్నర్లు ట్రంప్ మాటకు కట్టుబడినా.. డెమోక్రాట్ గవర్నర్లు మాత్రం లాక్‌డౌన్ ఎత్తేయడానికి ససేమిరా అన్నారు. మరోవైపు ట్రంప్ అనుచరులు కొందరు కృత్రిమ ఆందోళనలు సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లు ఉన్న రాష్ట్రాల్లోనే ఈ ఆందోళనలు చెలరేగడం.. వారికి మద్దతుగా ట్రంప్ ట్వీట్ చేయడంపై పెద్ద దుమారమే చెలరేగింది. కరోనాను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ డెమోక్రాట్లు విరుచుకపడ్డారు. ప్రజల ప్రాణాల కంటే తను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయని విమర్శలు గుప్పించారు.
సెనెట్ సభ కోసం నానా పాట్లు
కరోనా తగ్గుముఖం పట్టకపోయినా లాక్‌డౌన్ ఎత్తివేయాలనే ఆలోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. మరో భారీ ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలియజేసుకొని.. ఎన్నికలు సిద్ధం కావాలని భావిస్తున్నారు. దీనికోసం మే 4న సెనేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశరాజధాని వాషింగ్టన్‌లో జరిగే ఈ ఎగువ సభ సమావేశానికి సెనెటర్లు అందరూ హాజరు కావాలని సమాచారం అందించారు. అయితే కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో సెనెట్ సమావేశం ఏర్పాటు చేయడంపై పలువురు సెనెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సమావేశం ఏర్పాటు చేయడం సబబు కాదని వాదిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరుకావడంపై డెమోక్రటిక్ సెనెటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తాము ఈ సమావేశంలో పాల్గొనలేమంటున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్.. సెనెట్ సమావేశానికి వచ్చే వాళ్లు భయపడాల్సిన పని లేదని, అందరికీ పూర్తి వైద్య పరీక్షలు చేసిన తర్వాతే అనుమతిస్తామని చెబుతున్నారు. కేవలం 5 నిమిషాల్లో ముగిసే అబాట్ టెస్టులు నిర్వహిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఎలాగైనా ఈ సమావేశంలో మరో ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయించుకోవాలనే పట్టుదలలో ట్రంప్ ఉన్నారు. అంతే కాకుండా లాక్‌డౌన్ ఎత్తివేతకు మద్దతు కూడగట్టాలని కూడా భావిస్తున్నారు.
ఏం జరగబోతోంది..?
ట్రంప్ ప్రతిపాదించే ఉద్దీపన ప్యాకేజీకి సెనెటర్లు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కానీ, లాక్‌డౌన్‌ను ఇప్పటికిప్పుడు ఎత్తివేయాలనే నిర్ణయంపై మాత్రం తప్పక అభ్యంతరాలు వ్యక్తం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ లాక్‌డౌన్ ఎత్తివేసి ఏం సాధించాలని భావిస్తున్నారని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేస్తే ప్రమాదం అని చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తేసి.. అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టి హీరో అనిపించుకోవాలనేది ట్రంప్ ఎత్తుగడగా భావిస్తున్నారు. కానీ, తన ఎన్నికల విజయం కోసం ప్రజల ఆరోగ్యాలను ఫణంగా పెడతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ అమెరికాలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో కరోనా తగ్గినా కాలిఫోర్నియా ప్రాంతంలో పాజిటివ్ కేసులతో పాటు మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో రేపటి సెనెట్ల సమావేశంలో ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Tags: Donald Trump, Coronavirus, Economy, Senate Meeting, Senators, Lockdown, Covid 19