నాగపంచమి విషిష్టత.. ఈ రోజు ఏం చేయాలి ?

by Anukaran |   ( Updated:2021-08-13 00:10:26.0  )
నాగపంచమి విషిష్టత.. ఈ రోజు ఏం చేయాలి ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు నాగపంచమి, ప్రతీ సంత్సరం శ్రావణ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. దీనినే గరుడ పంచమి గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో నాగదేవత పూజ ఒక గొప్ప విశిష్ట, సంప్రదాయముగా ఆచరణలో ఉంది. ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున నాగ దేవతకు పూజ చేస్తూ ఉంటారు. పాపాల నుండి విముక్తి పొందడం కోసం తరతరాల నుండి నాగదేవతని పూజించడం కొందరికి ఆనవాయితీ.

ఈ నాగుల పంచమి రోజు నాగదేవతను పూజిస్తే కాలసర్పదోషాలు పోయి, ప్రజలు ఆనందంగా ఉంటారని పెద్దలు అంటారు. అదే విధంగా సకల పాపాలు తొలగిపోయి ప్రజలు ఆనందంగా జీవించడానికి పరమశివునితో పాటు ఆయన మెడలో ఉన్న నాగుపామును ఈ రోజు భక్తులు పూజిస్తారు. విష్ణుమూర్తి ఆదిశేషుని అనుగ్రహించిన రోజునే నాగ పంచమి అని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశేషుని కోరికను మన్నించిన మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున ప్రజలంతా సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు. అందుకే ఈ రోజును నాగుల పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున సర్ప పూజ చేస్తే శుభం కలుగుతుంది. అంతే కాకుండా కొత్తగా పెళ్లైన జంట పెద్ద ఎత్తున ఈ నాగపంచమి వేడుకలను జరుపుకుంటారు.

ఈ నాగపంచమి రోజు ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుందాం…

నాగపంచమి రోజున తెల్లవారే లేచి ఇల్లు శుభ్రంగా ఉంచుకుని ఆ తర్వాత పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు చల్లి, ముగ్గు వేసి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ ఐదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరిస్తారు. అంతే కాకుండా పాలు పండ్లు అర్పిస్తారు. నాగ పంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. ఆ తర్వాత వారు తింటారు. అంతే కాకుండా నాగ పంచమి రోజు కొందరైతే చెక్క, వెండి లేదా రాతితో చేసిన నాగ బొమ్మలని కొంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా కాల సర్ప దోషం తో ఉంటే ఈరోజు నాగదేవతకి పూజ చేయడం అత్యంత శుభప్రదం.

Advertisement

Next Story

Most Viewed