SRH జట్టును రషీద్ ఖాన్ వదిలేస్తున్నాడా.. మళ్లీ రాడా..?

by Shyam |
SRH జట్టును రషీద్ ఖాన్ వదిలేస్తున్నాడా.. మళ్లీ రాడా..?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు వచ్చే జనవరి నెలలో మెగా వేలం పాటను నిర్వహించనున్నారు. అంతకు ముందు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. మంగళవారం ముగిసిన ప్లేయర్ రిటెన్షన్స్‌లో పలు జట్లు కీలక ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రషీద్ ఖాన్‌ను విడుదల చేయడమే. అసలు SRH యాజమాన్యానికి, రషీద్ ఖాన్‌కు మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఇరు వర్గాల సన్నిహితుల మాటల ద్వారా ‘డబ్బు’ కీలకంగా మారినట్లు తెలుస్తున్నది.

రషీద్ ఖాన్ రూ. 14 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోరుకున్నాడని.. కానీ ఫ్రాంచైజీ అందుకు నిరాకరించినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి SRH ఫ్రాంచైజీ కేవలం కేన్ విలియమ్‌సన్, రషీద్ ఖాన్‌ను మాత్రమే రిటైన్ చేసుకొని వేలానికి వెళ్లాలని భావించింది. అయితే తనను మొదటి ప్లేయర్‌గా ఎంపిక చేయాలని రషీద్ కోరాడు. అలా అయితే రషీద్‌కు రూ. 14 కోట్లు, కేన్ విలియమ్‌సన్‌కు రూ. 10 కోట్లు దక్కుతుంది. అయితే రషీద్‌కు రూ. 12 కోట్లు ఇస్తామని.. కేన్‌ను తొలి ప్లేయర్‌గా తీసుకుంటామని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. చివరకు ఆ రూ. 2 కోట్ల వద్దే బేరం కుదరక రషీద్ ఖాన్ వదిలేసినట్లు తెలుస్తున్నది.

లక్ష్మణ్ ఏమన్నాడు..

ప్లేయర్ రిటెన్షన్స్ ప్రకటించే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోవాలని భావించాము. అయితే అతడు వేలంలోకి వెళితే మరింత వాల్యూ వస్తుందని భావించాడు. రెమ్యునరేషన్ విషయంలో యాజమాన్యంతో చర్చలు ఫలించలేదు. అందుకే అతడిని విడుదల చేశాము. కేన్ విలియమ్‌సన్‌తో పాటు మరో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ను తీసుకున్నాము. వేలంలో వీలైతే తిరిగి రషీద్‌ను తీసుకుంటాం’ అని లక్ష్మణ్ స్పష్టం చేశాడు. మెంటార్ లక్ష్మణ్ చెబుతున్నదాన్ని బట్టి రెమ్యునరేషన్ దగ్గరే ఇద్దరికీ చెడినట్లు కనపడుతున్నది. రషీద్ ఖాన్ ఐదేళ్ల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి సన్‌రైజర్స్ యాజమాన్యం దాదాపు రూ. 40 కోట్ల వరకు జీతభత్యాలు చెల్లించింది. అంతే కాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ అతడికి ఎన్నో మెలకువలు నేర్పించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రషీద్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్ మరింతగా ఎదిగింది. అలాంటిది ఇప్పుడు జట్టును వదలి వెళ్లిపోవడాన్ని యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.

రషీద్ వివరణ ఏంటి?

రషీద్ ఖాన్ ఈ విషయంపై ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. అయితే లండన్‌లో ఉండే రషీద్ ఖాన్ ఏజెంట్ సన్నిహితులు మాత్రం రిటెన్షన్లపై వ్యాఖ్యానించారు. రషీద్ ఖాన్ కేవలం డబ్బు కోసం జట్టును విడిచిపెట్టలేదని చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ ప్రవేశించడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కారణం. ఆ జట్టు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చింది. రషీద్ ఖాన్ కూడా డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అయితే అతడు తన కెరీర్‌లో కొత్తదనం కోరుకుంటున్నాడని వారు అన్నారు. కొత్త జట్టులోకి వెళ్లడం వల్ల మరింత ఎక్కువగా నేర్చుకోవచ్చని.. అదే సమయంలో కొత్త సవాళ్లు స్వీకరించే అవకాశం కూడా ఉంటుందని రషీద్ భావించినట్లు వారు చెప్పారు. రషీద్ ఖాన్ తన కెరీర్‌కు ఒక కొత్త ప్రారంభం ఇవ్వాలని అనుకున్నాడని.. అందుకే పాత జట్టును వదిలాడని చెప్పారు. కానీ, డబ్బు అసలు ప్రధాన సమస్య కాదని వారన్నారు. ఈ వ్యాఖ్యలు గమనిస్తే రషీద్ ఇక హైదరాబాద్ జట్టుకు వచ్చే అవకాశం లేనట్లేనని తెలుస్తున్నది. రషీద్ పూర్తిగా కొత్త జట్టుతో ఐపీఎల్ కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story