అసెంబ్లీ సాక్షిగా అటకెక్కిన సీఎం హామీ.. ఏండ్లు గడిచినా ఊసెత్తట్లే..!

by Shyam |   ( Updated:2021-08-19 22:17:44.0  )
cm-kcr
X

హెల్త్ ప్రొపైల్ స్టేట్ ఆఫ్ తెలంగాణనే ధ్యేయం. గవర్నర్ నుంచి లాస్టు మ్యాన్ వరకు… రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తికి హెల్త్ చెకప్ చేసి హెల్త్ కార్డు అందజేస్తాం. డేటాను కంప్యూటరైజ్డ్ చేస్తాం.. అమెరికా తరహాలో ఆస్తి, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ప్రతి ఈయర్ హెల్త్ చెకప్ చేయిస్తది.
-2018 మార్చి 15న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తాం.. ప్రొఫైల్ రికార్డు ప్రాజెక్టు కోసం కేబినెట్ సమావేశంలో ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేశాం. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయించాం. ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే వారికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్యసహకారం అందించేందుకు ఈ ప్రాజెక్టు సమాచారం దోహదపడుతుంది.
-2021 ఆగస్టు 19న ప్రగతి భవన్‌లో జరిగిన వైద్యఆరోగ్యశాఖ, ఐటీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ అమెరికా తరహాలో ప్రతిఏటా హెల్త్ చెక్ చేయిస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఓ సీఎం చేసిన ప్రకటనకే దిక్కులేకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకొని వారి సమాచారాన్ని కంప్యూటర్‌లో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సకుటుంబ సర్వేలో 3.64లక్షల మంది ఉన్నారని వారందరి ఆరోగ్య వివరాలను తెలుసుకునేందుకు 7నెలల సమయం పడుతుందని, పరికరాలు సమకూర్చి వెంటనే సర్వే చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఆరోగ్య వివరాలకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ కార్డును అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్డుతో ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే అందుకు తగిన విధంగా వైద్య సహకారం అందించేందుకు దోహదపడనుంది. అంతేకాదు వైద్య ఆరోగ్య రంగంలో వ్యాధుల ట్రెండ్స్, వాటి నివారణ, ఇతర కార్యక్రమాల తయారీలో ఈ ప్రాజెక్టు సహకారం అందిస్తుంది. అయితే కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు.

తాజాగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో వైద్యఆరోగ్యశాఖ, ఐటీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టి ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారానికి సంబంధించిన కనీస సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో చేపట్టేటువంటి భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచార విశ్లేషణ చేయడంతో వివిధ జిల్లాల్లో వ్యాధులు, సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్ ని గుర్తించి, ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివారణ, చికిత్స కు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. వైద్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరిచనున్నట్లు ప్రకటించారు. బీపీ, షుగర్, యూరిన్ తో పాటు వివిధ రక్త పరీక్షల వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరణ, అదనపు పరీక్షల అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహిస్తామని, హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌ను సేకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా, మంత్రి కేటీఆర్ మాత్రం మొదటగా రెండు జిల్లాలు ములుగు, సిరిసిల్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని ప్రజలందరి ఆరోగ్య వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇద్దరు తలోమాట మాట్లాడటంతో ప్రజల్లో గంధరగోళ పరిస్థితి నెలకొంది. ఇంతకు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును చేపడతారా? లేక రాజకీయాల కోసమే సమీక్షలతో కాలం గడుపుతారా? అనేది వారికే తెలియాలి. కేసీఆర్ ప్రకటించిన విధంగా హెల్త్ కార్డు అందజేస్తే కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేలో ప్రజలు మృత్యువాత పడకుండా కాపాడునేవారని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సీఎం, మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకుంటారో? లేదో వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story