- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఎంచుకున్న దారేటు?
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ దారెటు? రైతుల వైపా? కేంద్రం వైపా? ఢిల్లీ పర్యటనకు ముందు సీఎం రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు పలికారు. రైతు సంఘాల పిలుపు మేరకు జరిగిన ‘భారత్ బంద్’లో టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాలు పంచుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడి రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారని, వారి ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తారని భావించారు. కానీ, అలా జరుగలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్, హర్‌దీప్‌సింగ్ పూరి తదితరులను కలిసిన కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.
ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ రైతులకు సంఘీభావాన్ని ఎందుకు ప్రదర్శించలేకపోయారని వివిధ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో సోమవారం నుంచి ఆందోళనలను ఉధృతం చేయడం, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడించడం, జాతీయ రహదారులను దిగ్బంధించడం లాంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ ఆందోళనకు కేసీఆర్ కనీసం మద్దతు తెలుపుతారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
పోరు న్యాయమేన్నారు
“రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు. అందుకే వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో టీఆర్ఎస్ వ్యతిరేకించింది. చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు రైతులు వారి పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది” అని ఈ నెల ఆరున ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. బంద్‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా రైతులు తలపెట్టనున్న ఆందోళనలపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమాలాంటివి మొత్తం దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, ఇక్కడి ఫలితాలను చూసిన తర్వాతనే ఒడిషా, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు అనేక సందర్భాల్లో వెల్లడించారు. దేశంలో సంపన్న రైతు ఎక్కడ ఉన్నాడంటే తెలంగాణలోనే ఉన్నారని గర్వంగా చెప్పుకునే విధానాలు ఇక్కడ అమలవుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఆందోళనకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుందా? లేక ఢిల్లీ పరిణామాలతో మారుతుందా? అని విపక్షాల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి ‘రీజనల్ కాంక్లేవ్’ పేరుతో హైదరాబాద్ నుంచే కార్యాచరణ మొదలుపెడతానని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబరు రెండవ వారం దాదాపుగా పూర్తయింది. కాంక్లేవ్ విషయం మాత్రం కొలిక్కి రాలేదు. రెండు జాతీయ పార్టీలు 70 ఏండ్లు ఏలినా దేశానికి దిశా నిర్దేశం చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేసీఆర్ భవిష్యత్తు రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకరకంగా ఇది ఆయన రాజకీయ నీతికి అగ్నిపరీక్షగా మారింది.