ఏం చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: ప్రముఖ పత్రిక ఎడిటర్ విమర్శలు

by srinivas |
aisf v
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులకు విద్య, ఉపాధి కల్పించలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ విమర్శలు చేశారు. హిమాయత్‌నగర్‌లోని ఎన్ సత్యనారాయణరరెడ్డి భవన్‌లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నిరుద్యోగ పోరు సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో మోడీ, ఇంటికో ఉద్యోగమని సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి గద్దెనెక్కారన్నారు. పాలక వర్గాల తీరుపై విద్యార్థి, యువత, నిరుద్యోగులు పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని వేణుగోపాల్ పిలుపునిచ్చారు.

modi

ప్రధాని మోడీ ప్రభుత్వ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు ధారాధత్తం చేస్తున్నారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో పాఠశాలలను కాషాయికరణ, ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్ ఉద్యోగ భర్తీలో విఫలమయ్యారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఏడాదికి 90 లక్షలకు పైగా నిరుద్యోగులుగా మిగులుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్, ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గత డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలుంటే రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులకు కావల్సింది భృతి కాదని, ఉద్యోగాలని వారు పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రాష్ట్రంవ్యాప్తంగా 42 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3,785 పాఠశాలలను మూసివేస్తున్నారని, 7 వేల ఉపాధ్యాయ పోస్టులకు ఎగనామం పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని వారు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గోళి హరికృష్ణ, జిల్లా కార్యదర్శి గ్యార నరేశ్, జిల్లా మహిళా కన్వీనర్ స్వప్న, ఆర్గైజింగ్ సెక్రెటరీ చైతన్య, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, శ్రీమాన్, ఉప్పల ఉదయ్ కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఆర్గైజింగ్ సెక్రెటరీ మహమూద్, నాయకులు హరీశ్, సత్య, కిషోర్, రవికిరణ్, శివ, రాజు, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story