వామన్‌రావు దంపతుల హత్యకు కారణాలు ఇవేనా..?

by Sridhar Babu |   ( Updated:2021-02-18 06:34:04.0  )
వామన్‌రావు దంపతుల హత్యకు కారణాలు ఇవేనా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హై కోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ఐదుగురు నిందితులు రామగుండం పోలీసుల ముందు లొంగిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హత్య కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్ తో పాటు మరో నలుగరు నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నట్టు సమాచారం. అయితే పోలీసు వర్గాలు మాత్రం ఈ విషయాన్ని దృవీకరించడం లేదు. వీరి నుండి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు రాబడ్తున్నట్టు తెలుస్తోంది. వామన్ రావు దంపతులను హత్య చేయడానికి కారణం ఏంటీ? రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.

కోణం అదేనా.. మూలం ఏమైనా ఉందా ?

కుంట శ్రీనివాస్ హత్య చేయడానికి ప్రధానంగా వీరి స్వగ్రామంలో నెలకొన్న పరిస్థితులేనని స్పష్టం అవుతోంది. గ్రామంలో నిర్మిస్తున్న ఆలయంతో పాటు, కుంట శ్రీనివాస్ నిర్మించుకున్న ఇంటి విషయంలోనూ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి హత్య వరకు దారి తీసిందని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు సమాచారం. అయితే ఈ హత్యకు మూల కారణం ఎవరూ? శ్రీనివాస్ కు వెన్నుదన్నుగా నిలిచిందెవరూ అన్న వివారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న వామన్ రావు దంపతుల హత్య కేసులో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళనలు కూడా మిన్నంటిపోయాయి. విచారణలో పోలీసులు అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

మూడు నెలలుగా ప్రచారం…?

గట్టు వామన్ రావును హత్య చేస్తారన్న ప్రచారం మంథని ప్రాంతంలో గత మూడు మాసాలుగా విస్తృతంగా సాగుతోంది. వామన్ రావును హత్య చేసేందుకు రెక్కీ వేసుకున్నారని కూడా స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనకు ప్రాణహాని ఉందని వామన్ రావు హై కోర్టును ఆశ్రయించినా రక్షణ ఎందుకు కల్పించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. ఇప్పుడు ఇదే అంశం ప్రతిపక్షాలకు పాశుపతాస్త్రంగా మారిపోయింది. మంథని ప్రాంతానికి చెందిన వివిధ కేసుల్లో వామన్ రావు దంపతులు హైకోర్టును ఆశ్రయించిన తరువాత మంథనికి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం లేదని గమనించే పథకం వేసుకుని ఉంటారని తెలుస్తోంది.

Advertisement

Next Story