విశాఖ టు హైదరాబాద్..గంజాయి ముఠా అరెస్టు

by Shyam |
విశాఖ టు హైదరాబాద్..గంజాయి ముఠా అరెస్టు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్‌కు గంజాయి తరలించేందుకు యత్నిస్తున్న ఓ ముఠాను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ బృందం స్థానిక అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల సహకారంతో దాడులు జరిపి 81కిలోల గంజాయి, నిందితులు వాడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నునావత్ జగన్, వంకుడోతు సాయి, మాలోత్ వినోద్, నునావత్ సుధాకర్, వంకుడోత్ జితేందర్‌లు సూర్యాపేట జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరికి తుర్కయాంజల్‌లో నివాసముండే నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన కేతావత్ మురళి పరిచయం అయ్యాడు. వీరంతా తమ జల్సాల కోసం సులువుగా డబ్బు సంపాదించేందుకు రెండేండ్లుగా పలు నేరాలకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. ఈ క్రమంలో గత రెండేండ్లుగా ఏపీ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నారు. వీరిపై తూర్పుగోదావరి జిల్లా, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే, కేతావత్ మురళికి రాజమండ్రి సెంట్రల్ జైలులో రాజస్థాన్‌కు చెందిన రాకేష్ పరిచయం అయ్యాడు. విశాఖపట్నం నుంచి గంజాయిని రూ.1500లకు కొనుగోలు చేసి, రాజస్థాన్‌లో రూ.8 వేలకు విక్రయించేందుకు రాకేష్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌కు చెందిన రాజు నుంచి గురువారం 81 కిలోల గంజాయిని పార్సిల్ ప్యాకింగ్ చేయించి రెండు మహింద్రా కార్లలో నగరానికి బయలుదేరారు. రాజస్థాన్‌కు చెందిన రాకేష్ హైదరాబాద్‌లో అందుబాటులో లేనందున.. అతని సూచన మేరకు గంజాయిని రిసీవ్ చేసుకోవడానికి అనూప్ కుమార్ పెద్ద అంబర్ పేటలో వెయిట్ చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద అంబర్ పేట వద్ద శుక్రవారం ఉదయం నునావత్ జగన్, మురళీలు అనూప్ కుమార్‌కు సరుకు అందజేస్తుండగా పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు.

మొత్తం 81కిలోల గంజాయితో పాటు 2 వాహనాలు, రూ.1.45 లక్షల నగదు, 9 మొబైల్ ఫోన్లు కలిపి రూ.30 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధం కలిగి ఉన్న9 మందిలో 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌కు చెందిన రాకేష్, విశాఖకు చెందిన రాజు పరారీలో ఉన్నారు. గంజాయి సరఫరాను విజయవంతగా అడ్డుకున్న అబ్దుల్లాపూర్ మెట్, ఎల్భీనగర్ ఇన్ స్పెక్టర్లు దేవేందర్, రవికుమార్, ఎస్ఐలు సత్యనారాయణ, అవినాష్ బాబు తదితర సిబ్బందిని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.

Advertisement

Next Story