‘మత్తు’ నీడలో దక్షిణ కాశీ.. యువతే టార్గెట్!

by Shyam |
‘మత్తు’ నీడలో దక్షిణ కాశీ.. యువతే టార్గెట్!
X

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణంలో కొంత కాలంగా గంజాయిని దందా సాగుతోంది. హైదరాబాద్‌ నుంచి వేములవాడకు రవాణా అవుతున్న గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. వేములవాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తుండటంతో ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. చుట్టూ పక్కల గ్రామాల యువత గంజాయికి బానిసలు అయ్యారని విచారణలో తేలినట్లు సమాచారం.

వేములవాడలో జోరుగా..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడంతో గంజాయి సరఫరా చేసేందుకు విక్రయదారులకు సులభతరమవుతోంది. కానీ పోలీసులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ కొంతకాలంగా గంజాయి రవాణా పై దృష్టిపెట్టిన పోలీసులకు గంజాయి అలవాటు ఉన్న ముగ్గురు యువకులు దొరికారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సరఫరా చేసే వ్యక్తి వివరాలు చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

రిమాండ్‌కు నిందితులు..

వేములవాడలో గంజాయి సేవించే ముగ్గురితో పాటు విక్రయించే ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు ఇటీవల టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. జగిత్యాల బస్టాండ్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా యువకులు చందు, శరత్, సతీశ్‌లు పట్టుబడ్డారన్నారు. వారికి గంజాయి ఎలా వచ్చిందని వివరాలు సేకరించగా, వేములవాడ పట్టణానికి చెందిన అఖిల్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుకున్నట్లు చెప్పారు. దీంతో అఖిల్‌ను సైతం అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లోని దూల్‌పేటలోని కొందరు వ్యక్తుల నుంచి గంజాయి కొనుక్కొచ్చి వేములవాడలో అమ్ముతున్నట్లు తెలిపాడు. వారి నుంచి 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story