నారీ లోకం నడుం బిగిస్తే జరగని పని ఉండదు : జగదీష్ రెడ్డి

by Sridhar Babu |   ( Updated:2021-11-01 06:19:22.0  )
నారీ లోకం నడుం బిగిస్తే జరగని పని ఉండదు : జగదీష్ రెడ్డి
X

దిశ, సూర్యా పేట : 22 వ సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్న అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం కచ్చితంగా వర్తమానానికి స్ఫూర్తి దాయకంగా నిలబడు‌తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పది మంది సభ్యులతో ప్రారంభమై పదివేల మందికి చేరడమే కాకుండా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుని 22 వ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం ముమ్మాటికీ సంఘం క్రమశిక్షణ‌కు నిదర్శనమన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్థిక సమతా మండలి ఆధ్వర్యంలో 22 సంవత్సరాల క్రితం ఆవిర్భావించిన అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం 22 వ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నారీ లోకం నడుం బిగిస్తే జరగని పని అంటూ ఉండదన్నారు. అందుకు కరీంనగర్ జిల్లా ముల్కనూర్ పాల సొసైటీ ముందు వరుసలో ఉండగా అదే వరసలో సూర్యాపేట కు చెందిన అంత్యోదయ సొసైటీ నిలిచిందని ఆయన కొనియాడారు. అందుకు మహిళలు సంఘటితమై ఏర్పరచుకున్న సొసైటీలో క్రమశిక్షణ, నిబద్ధత లను పాటించడమే కారణం అని ఆయన చెప్పారు. ఎన్నో ప్రభుత్వ సంస్థలను నష్టాల పాలుజేసి రాత్రికి రాత్రే మూసి వేస్తున్న తరుణంలో మహిళలు ఏర్పరచుకున్న అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం ఏకంగా 22 వ సంవత్సరం లోకి అడుగిడడం అభినందనీయమన్నారు. అటువంటి సంస్థ పురోగతి‌లో ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తే తప్పకుండా తోడ్పాటునందిస్తానని మంత్రి జగదీష్ రెడ్డి సంఘానికి హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story