గేయ రచయిత యాదగిరికి అండగా ఉంటాం : కేటీఆర్

by Shyam |
గేయ రచయిత యాదగిరికి అండగా ఉంటాం : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పాటలతో పాటు ఎన్నో గేయాలు రచించిన రచయిత కందికొండ యాదగిరిని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కందికొండ గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి.. వైద్య సేవల నిమిత్తం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్‌కు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. గతంలో కూడా కందికొండ కుటుంబానికి అండగా నిలిచామని.. ఇప్పుడు కూడా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

తెలంగాణ జాతి ఆత్మ రా బతుకమ్మ.. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకుల బతుకమ్మ.., మళ్లి కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా.., గల గల పారుతున్న గోదారిలా.. జలజల జారుతుంటే కన్నీరెలా..! ఇలా పలు పాటలను రాశారు కందికొండ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, పండుగల విశిష్టతను విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలను రచించారు కందికొండ యాదగిరి.

ఆయన ప్రస్తుతం గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో తెరఫీ చేయించుకోవడం ద్వారా స్పైనల్ కార్డ్‌లోని విభాగాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కందికొండ ఆరోగ్య పరిస్థితిని పలువురు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు వివరించారు. స్పందించిన కేటీఆర్ వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్‌కు పలువురు కవులు, రచయితలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story