అంగుళం భూమి కూడా కోల్పోలేదు: ప్రధాని

by Shamantha N |   ( Updated:2020-06-19 12:06:18.0  )
అంగుళం భూమి కూడా కోల్పోలేదు: ప్రధాని
X

న్యూఢిల్లీ: మన భూమిని ఎవ్వరూ ఆక్రమించలేదనీ, మన దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా కోల్పోలేదని ప్రధాని నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. లడాఖ్‌ గాల్వాన్ లోయలో చైనా సరిహద్దులో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలపై చర్చించేందుకు ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలను సమ్మతిస్తామని మెజార్టీ పార్టీలు చెప్పాయి. కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సరిహద్దు వివరాలను పార్టీలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్ శాంతిని, స్నేహాన్ని కోరుతున్నదని అన్నారు. కానీ, దేశ సార్వభౌమత్వంపై ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని పునరుద్ఘాటించారు. బీజేపీ సహా కాంగ్రెస్, టీఎంసీ, ఏఐఏడీఎంకే, డీఎంకే, టీఆర్ఎస్, జేడీ(యూ), బీజేడీ, ఎల్‌జేపీ, బీఎస్‌పీ, శివసేన, ఎన్‌సీపీతోపాటు పలుపార్టీల అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానితోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లు హాజరయ్యారు. చైనా సరిహద్దులో మరణించిన 20 మంది జవాన్లకు ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు మౌనం పాటించి నివాళి అర్పించారు.

చైనా ఆర్మీ ఎన్నడు చొచ్చుకొచ్చింది?: సోనియా

అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ తేదీన చైనా సైన్యం లడాఖ్‌లోని మన భూభాగంలో అడుగుపెట్టార? ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది? ఇప్పుడు చెబుతున్నట్టు మే 5వ తేదీనేనా.. అంతకన్నా ముందా? సరిహద్దుకు సంబంధించి కేంద్రానికి శాటిలైట్ ఇమేజ్‌లు ఎప్పటికప్పుడు అందలేదా? ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేయలేదా? సరిహద్దు సమీపంలో చైనా కట్టడాలు, ఆ దేశ ఆర్మీ చొచ్చుకురావడంపై మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్కారును అప్రమత్తం చేయలేదా? ప్రభుత్వ దృష్టిలో ఇది నిఘావైఫల్యమా? అని ప్రశ్నలు సంధించారు. ఈ అఖిలపక్ష సమావేశం ఇంకా ముందే నిర్వహించాల్సిందని, ఇన్నాళ్లు తామందరూ సమాచారానికి దూరంగా ఉండిపోయామని చెప్పారు.

మేం ప్రభుత్వం వెంటే : మమతా

‘చైనా ప్రజాస్వామిక దేశంకాదు. ఒక నియంతృత వ్యవస్థ. వారికి ఇష్టమొచ్చింది చేస్తారు. ఈ క్లిష్ట సమయంలో మనమే అందరం కలిసి పనిచేయాలి. ఐక్యంగా మాట్లాడాలి, ఆలోచించాలి, పనిచేయాలి. మేం పూర్తిగా ప్రభుత్వం వెంటే ఉన్నాం. టెలికాం, రైల్వే, వైమానిక రంగాల్లోకి చైనాను స్వాగతించవద్దు’ అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు.

పార్టీలు అన్ని ఐక్యంగా ఉండాలని, కేంద్రానికి మద్దతునివ్వాలని జేడీ(యూ) నేత నితీష్ కుమార్ తెలిపారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ, అది బలహీన దేశం కాదని శివసేన చీఫ్ ఉద్ధశ్ ఠాక్రే అన్నారు. తాము ప్రధాని, సైన్యం, వారి కుటుంబాలకు మద్దతుగా ఉంటామని అన్నారు. సైన్యం ఆయుధాలను తీసుకెళ్లిందా? లేదా? అనేది అంతర్జాతీయ ఒప్పందాలు చూసుకుంటాయని, వాటిని గౌరవించాలని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ, టీఆర్ఎస్, డీఎంకే, అకాలీదళ్, సమాజ్‌వాదీ పార్టీలు ఎన్‌పీపీ సహా పలుపార్టీల నేతలు పీఎంకు అండగా ఉంటామని తెలిపారు.

భారత సైన్యం సిద్ధంగా ఉన్నది: రాజ్‌నాథ్ సింగ్

భారత్, చైనా సరిహద్దులో ఎటువంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలకు భరోసా ఇచ్చారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆయన వివరించారు. అలాగే, లడాఖ్ గాల్వన్ లోయలో ఘర్షణలకు ముందు ఆ తర్వాత ఆర్మీ మోహరింపులు ఎలా ఉన్నాయనే విషయాన్ని వివరించి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed