ఇదీ.. బంగారు తెలంగాణలో మిషన్ కాకతీయ పరిస్థితి

by Anukaran |
ఇదీ.. బంగారు తెలంగాణలో మిషన్ కాకతీయ పరిస్థితి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో ఎడతెరిపి లేకుండా ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీరంతా చెరువుల్లో చేరకుండా వృథాగా పోతోంది. వాన నీటిని నిల్వ చేయడంలో ఇరిగేషన్ అధికారులు విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను పూర్తి చేయడంలో అధికారులు జాప్యం చేశారు. ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పూడికతీత పనులను నేటికీ చేయలేకపోయారు. జిల్లాలో 2,033 చెరువులకు గాను నాలుగు విడతల్లో 1,146 చెరువులను పునరుద్ధరించాల్సి ఉండగా కేవలం 845 చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టారు. మిగిలిన చెరువుల్లో పూడికతీత పనులు చేయకపోవడంతో కురుస్తున్న వర్షాలకు నీరు నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది.

మిషన్ కాకతీయ కింద విడతల వారీగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ అసంపూర్తిగా కొనసాగింది. రంగారెడ్డి జిల్లాలో 4విడతల్లో 1,146 చెరువుల్లో పూడిక తీయాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ, కేవలం 845 చెరువుల మరమ్మతు పనులు చేపట్టి పూడిక తీశారు. మొదటి విడతలో 325 చెరువులకు అనుమతి లభిస్తే 310 చెరువులను పునరుద్ధరించారు. రెండో విడతలో 497 చెరువులకు అనుమతులు లభిస్తే 357 చెరువుల పనులు పూర్తి చేశారు. మూడో విడతలో 228 చెరువులకు గాను 144 పనులను పూర్తి చేశారు. నాలుగో విడతలో 96 చెరువులకు గాను 34 చెరువుల పూడికతీత పనులు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నాలుగు విడతల్లో మొత్తంగా 301 చెరువుల్లో పూడికతీయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

68,904 ఎకరాల ఆయకట్టు…

రంగారెడ్డి జిల్లాలో 2,033 చిన్న, మధ్య తరహా చెరువులున్నాయి. వీటి ద్వారా సుమారుగా 68,904 ఎకరాల ఆయకట్టకు సాగునీరందించే అవకాశం ఉంది. కానీ సరైన సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో చెరువులు నిండడం కష్టంగా మారింది. చెరువుల్లో పూడిక మట్టిని తొలగిస్తే వర్షాలు వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జిల్లాలో పూర్తిస్థాయిలో చెరువులను మరమ్మతులు చేయకపోవడంతో కురుస్తున్న వర్షాలకు నీరు వృథాగా పోతున్నది. 100 ఎకరాలపైన ఆయకట్టు ఉన్న చెరువులు సుమారు 139 ఉన్నాయి. వీటికింద 27,937 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా 100 ఎకరాల ఆయకట్టులోపు ఉన్న చెరువులు 1,894 ఉన్నాయి. వీటికి కింద మొత్తంగా 40,967 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Advertisement

Next Story