నీటి పిల్లులా..నీటి పిడుగులా?

by Shyam |
నీటి పిల్లులా..నీటి పిడుగులా?
X

దిశ, కరీంనగర్:
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకోవాలని కలలు కన్న మత్స్యకారులపై పిడుగు పడింది. గోదావరిలో పెరుగుతున్న చేపలను రేపో మాపో అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకున్న వారికి నీటి పిల్లుల రూపంలో ఆపద ఎదురైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం, మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజ్ బ్యాక్ వాటర్‌లో చేపలు, రొయ్యల పెంపకం చేపడితే స్థానిక మత్స్యకారులకు నిరంతర ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిల్వ ఉన్న నీటిలో 25 లక్షల చేప పిల్లలు, 11.50 లక్షల రొయ్య పిల్లలను విడిచారు. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు గోదావరి నీటిలో పెరుగుతున్న చేపలపై ఆధారపడి 600 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ చేప పిల్లలు సుమారు 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు బరువుకు పెరిగాయి. మరికొంత బరువు పెరిగిన తర్వాత చేపల్ని పట్టి అమ్ముకుందాం అనుకున్నారు. అంతలోనే వీరి ఆశలు అడియాశలయ్యాయి. చేపలు ఎదిగి చేతికొచ్చే సమయంలో నీటి పిల్లులు రంగ ప్రవేశం చేశాయి. బ్యారేజ్ బ్యాక్ వాటర్ అంతా కలియ తిరుగుతూ చేపలను వేటాడి తింటున్నాయి. చూసేందుకు చిన్నగా ఉండే ఈ ఉభయ చర జీవిని ‘వాటర్ డాగ్స్’ అని కూడా అంటారు. నీటిలోపల కూడా 5 నిమిషాల వరకు ఉండే నీటి పిల్లులు సుమారు 200 వరకు వచ్చి చేరి చేపలను తినేస్తున్నాయి. మత్స కారులు చేపల కోసం ఏర్పాటు చేసిన వలలను వాటి పళ్లతో తునాతునకలు చేసి మరీ వేటాడుతున్నాయి.

దీంతో నీటి పిల్లుల సమస్యను పరిష్కరించడం ఎలా అన్నది మత్స్యకారులకు అంతుచిక్కడం లేదు. వీటిని కట్టడి చేసే పరిస్థితి లేదని అధికారులు కూడా చేతులెత్తేశారు. ప్రభుత్వమే తమకు ఏదో ఒక మార్గం చూపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

tags : Water Dogs, Godavari, kaleshwaram, back Water

Advertisement

Next Story

Most Viewed