ట్రంప్‌కి ‘తాజ్‌’ గైడ్ ఇతనే!

by  |
ట్రంప్‌కి ‘తాజ్‌’ గైడ్ ఇతనే!
X

దిశ, వెబ్‌డెస్క్:

డొనాల్డ్ ట్రంప్ కుటుంబం తాజ్‌మహల్‌ని చూసి అద్భుతంగా ఉందని పొగిడారు, నిర్మాణ శైలి గురించి అడిగి తెలుసుకున్నారు, వెనక కథలను అడిగారని మనకు తెలుసు. కానీ ఎలా తెలుసు? మనల్ని అడగలేదు కదా.. అవును, వారికి తాజ్‌మహల్ దగ్గరుండి చూపించిన గైడ్ చెప్పాడు. ఆ గైడ్ ఎవరో మనం తెలుసుకుందాం.

ఆ గైడ్ పేరు నితిన్ సింగ్. 36 ఏళ్ల ఈ గైడ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్‌లకు తాజ్‌మహల్‌ని దగ్గరుండి చూపించాడు. కేవలం ట్రంప్‌ కుటుంబానికి మాత్రమే కాదు, గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, కెనడా ప్రధాని జస్టిన్ త్రెదో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రోన్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోలకు కూడా తాజ్‌మహల్ గైడ్ చేసింది నితినే.

గైడ్ చేయడంలో అనుభవం ఉన్నప్పటికీ ఈసారి కాస్త నెర్వస్‌గా అనిపించినట్లు నితిన్ చెప్పాడు. తాను చెప్పే విషయాలన్నీ ట్రంప్ దంపతులు ఓపిగ్గా విన్నారని, తాజ్‌మహల్ వెనక గాథ తెలుసుకుని బాధ పడ్డారని, ఇవాంకా ట్రంప్ అయితే ఔరంగజేబు గురించి చెప్పాక, మొత్తం మొగలుల చరిత్రను అడిగి మరీ తెలుసుకుందని నితిన్ వివరించాడు. తాజ్‌మహల్ నిర్మాణ శైలి చూసి ట్రంప్ ఆశ్చర్యపోయాడని నితిన్ అన్నారు.

తాజ్‌మహల్‌ని చూడగానే అద్భుతంగా ఉందని ట్రంప్ అన్నట్లు నితిన్ చెప్పాడు. అంతేకాకుండా మరోసారి తాజ్‌మహల్ చూడటానికి వస్తానని ట్రంప్ కుటుంబం అన్నట్లు నితిన్ వెల్లడించాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిని గైడ్ చేయగలగడం ఆనందంగా ఉందని నితిన్ సంబరపడ్డాడు.


Next Story

Most Viewed