వైరస్ వార్తలకు బెదిరిపోవద్దు : వారెన్ బఫెట్!

by Harish |
వైరస్ వార్తలకు బెదిరిపోవద్దు : వారెన్ బఫెట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్లు భారీ పతనాలను చూడటంతో ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మదుపర్లలో ఉన్న భయాలను తొలిగించేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తున్న కరోనాను చూసి కంగారు పడిపోయి షేర్లను అమ్ముకోనవసరం లేదని వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. కేవలం కరోనా వైరస్‌ను చూసి షేర్లను అమ్ముకోవద్దని, బలమైన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత పది లేదా ఇరవై ఏళ్ల వరకూ వేచి చూస్తేనే మార్కెట్లో సంపాదన అనేది ఆర్జించగలమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వైరస్‌లు మార్కెట్‌కు ఉన్న దీర్ఘకాలికమైన ఔట్‌లుక్‌ను మార్చే పరిస్థితి లేదని, కొద్ది రోజులు మాత్రమే ఇవి ప్రభావం చూపిస్తాయని, మన నిర్ణయాలను ప్రభావితం చేసేంత పెద్దవి కావని వారెన్ బఫెట్ సూచించారు.

ఈ వారం కరోనా వైరస్ మరణాలు చైనాను దాటి దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలో మరణాల సంఖ్య పెరిగాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా సరఫరా దెబ్బతిని, ఆర్థిక రంగం పతనానికి కారణమవుతోంది. ఈ క్రమంలో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టే మదుపర్లు స్వల్ప కాలం ప్రభావితం చేసే వార్తలకు బెదిరిపోవాల్సిన అవసరం లేదని వారెన్ బఫెట్ అన్నారు. మార్కెట్లు దిగజారినప్పుడే మన పెట్టుబడులకు బాండ్స్ రూపంలో కాకుండా షేర్ల ద్వారా రాబడి అధికంగా ఉంటుందన్నారు. యూఎస్ ఎకానమీ గడిచిన ఆరు నెలల కాలంతో పోలిస్తే కొంత మందగించిందని తెలిపారు. తన సొంత సంస్థ బర్క్‌షైర్‌కు చెందిన వ్యాపారాలపై కరోనా ప్రభావం ఉందని, గతంలోనూ రాబడి ఇవ్వని సందర్భాలున్నాయని, ఇవన్నీ సహజపరిణామాలేనని వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed