టోకెన్‌లతో ఓటర్లు.. అభ్యర్థితో సంబంధం లేదన్న షాపు యజమాని

by Shamantha N |
టోకెన్‌లతో ఓటర్లు.. అభ్యర్థితో సంబంధం లేదన్న షాపు యజమాని
X

చెన్నై: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల గిమ్మిక్కులు ఎంతో కాలం నిలవవు. వారి బూటకపు వాగ్దానాలు త్వరగానే బట్టబయలవుతాయి. ఓటర్లూ మోసపోవడం సర్వసాధారణంగానే కనిపిస్తుంది. కానీ, తమిళనాడులోని కుంబకోణంలో తాము మోసపోయినట్టు కాస్త తొందరగానే గ్రహించిన ఓటర్లు ఖంగుతిన్నారు. ఆగ్రహానికి లోనయ్యారు. తంజావూరు జిల్లాలోని కుంబకోణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ అభ్యర్థి అబద్ధపు వాగ్దానంతోపాటు ఓటర్లను నమ్మించడానికి టోకెన్‌లను పంచారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలానా షాపులో ఈ టోకెన్లు అప్పజెబితే రూ. 2000 సరుకులు పొందవచ్చునని నమ్మబలికారు.

టోకెన్లు తీసుకున్న ఓటర్లు ఎన్నికలు ముగిసేవరకు ఓపిక పట్టారు. పోలింగ్ తర్వాతి రోజే కుంబకోణంలోని ఆ షాపు ముందు బారులు తీరారు. షాపు తెరుచుకోగానే రగడ మొదలైంది. సదరు అభ్యర్థితో తమకు సంబంధం లేదని, ఆ టోకెన్‌లకు తాము సరుకులివ్వబోమని షాపు యజమాని షేక్ మహమ్మద్ కరాఖండిగా చెప్పడంతో క్యూలో నిల్చున్న ఓటర్లు షాకయ్యారు. కోపంతో రగిలిపోయారు. షాపు వదిలి వెళ్లిపోవడానికి ససేమిరా అన్నారు. గొడవకు దిగడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు రావల్సి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేయగా ఏఎంఎంకే నేత కనగరాజుకు ఇందులో ప్రమేయమున్నట్టు తెలిసిందని, ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed