ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు ముప్పు..?

by Anukaran |   ( Updated:2020-11-24 00:11:27.0  )
ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు ముప్పు..?
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరేండ్లలో రూ.67 వేల కోట్లతో అభివృద్ధి చేశాం. ఎస్సార్డీపీతో ఎన్నెన్నో ఫ్లైఓవర్లు, మల్టీ ఫ్లైఓవర్లు నిర్మించాం. మౌలిక సదుపాయాలు కల్పించామంటూ టీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కానీ అభ్యర్థుల ఖరారులో సర్వేలను పట్టించుకోలేదని తెలుస్తోంది. మెజార్టీ స్థానాల్లో సిట్టింగులకే అవకాశం కల్పించారు. అదే టీఆర్ఎస్ పార్టీకి కష్టంగా మారిందంటున్నారు. మొన్నటి వరకు జనాన్ని నిర్లక్ష్యం చేసిన కొందరు కార్పొరేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రచారంలో తీవ్ర వ్యతిరేకతను చూస్తున్నామని కార్యకర్తలు చెబుతున్నారు. ఇన్నాండ్లుగా తమ కాలనీలు, బస్తీలకు రాని కార్పొరేటర్లు ఓట్ల పేరిట మళ్లీ వస్తుండడంతో ప్రజలు నిలదీస్తున్నారు. వారిని సముదాయించలేక గెలుపు బాధ్యతలను మీదేసుకున్న డివిజన్ల ఇన్‌చార్జిలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఎమ్మెల్యేలు కోరినా వినని అధిష్ఠానం
కొన్ని డివిజన్లలో సిట్టింగులకు టికెట్లు ఇస్తే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో సగానికి పైగా మార్చాల్సిందేనని పట్టుబట్టారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కొందరు అక్రమాల గురించి తెలిసినా పట్టించుకోకుండా వారి అభ్యర్థిత్వాలనే ఖరారు చేశారు. ఎన్నో ఫిర్యాదులు అందినా, మీడియాలో పలు కథనాలు వచ్చినా పరిగణనలోకి తీసుకోలేదు. మళ్లీ వారినే గెలిపించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ క్రమంలో కొన్ని డివిజన్లలో ఐదేండ్లలో చోటు చేసుకున్న అభివృద్ధి కంటే వారి అక్రమాలే ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. అక్రమాల కేంద్రంగా ఉన్న డివిజన్లలో టీఆర్ఎస్ ప్రచారానికి సీన్ రివర్స్‌గా మారుతోందంటున్నారు. ప్రచారానికి వెళ్తే తమ కాలనీ, బస్తీ పనులు చెప్పినా ఎందుకు చేయలేదంటూ నిలదీస్తున్న సందర్భాలు ఉన్నాయి.
ఎన్నెన్నో సిత్రాలు
  • ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లో.. ప్రచారంలో నేను ఓటర్లకు దండం మాత్రమే పెడతా.. ఏది ఉన్నా, ఏది చెప్పాలనుకున్నా, ఏది అడగాలన్నా ఇన్‌చార్జిగా వచ్చిన ఎమ్మెల్యేనే అడగాలని అభ్యర్థి చెబుతున్నారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు కార్పొరేటర్‌గా పని చేశారు. మూడో సారి పోటీ చేస్తున్నారు. దాంతో సదరు ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఇంతగా వ్యతిరేకత ఉన్న డివిజన్ లో నేనేం చేయాలంటూ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీంలో కీలకంగా ఉన్న నేతకు చెప్పుకొని బాధ పడ్డారు.
  • మరో డివిజన్‌లో కార్పొరేటర్ ప్లాట్లను కబ్జా పెట్టారని, నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులతో ఫోన్లు చేయించుకున్నా న్యాయం జరగడం లేదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డివిజన్ ఇన్‌చార్జికి ముచ్చెమటలు పట్టాయి.
  • ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన తొలి రోజు నుంచి వసూళ్ల పర్వానికి పాల్పడిన ఓ కార్పొరేటర్ ను ప్రచారానికి కాలనీకొస్తే అడ్డుకుంటున్నారు. ఇన్నాండ్లుగా రూ.135 కోట్లతో అభివృద్ధి చేశానన్నావ్.. ఎక్కడ చేశావంటూ నిలదీస్తున్నారు. ఆ డివిజన్‌లో గెలుపు కష్టమేనని ముందుగానే అధిష్ఠానం గుర్తించింది. అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జిలుగా పెట్టారు. ఎంత వ్యతిరేకత ఉన్నా విస్తృతంగా ప్రచారం చేసి గెలిపించాలన్న అధిష్ఠానపు ఆదేశాలతో కష్టాలు పడుతున్నారు.
  • ఉప్పల్ నియోజకవర్గంలో చెరువు కబ్జాకు పరోక్షంగా సహకరించిన కార్పొరేటర్ మళ్లీ ప్రచారానికి వస్తే నిలదీశారు.
  • మల్కాజిగిరిలో రోడ్లు బాగా లేవు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తామంటూ కాలనీవాసులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును నిలదీశారు. దాంతో ఆయన లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాల్సి వచ్చింది.
  • ఎల్బీనగర్‌లో గెలిచిన తర్వాత ఏ ఒక్కసారి కూడా కాలనీ, బస్తీ ముఖం చూడని ఓ కార్పొరేటర్‌కు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. పైగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత ప్రియమైన వ్యక్తినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని నలుగురికి చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. ప్రచారానికి వెళితే స్పందన రావడం లేదు.
Advertisement

Next Story