ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న వీవో

by Shiva |   ( Updated:2021-02-10 08:14:24.0  )
ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న వీవో
X

దిశ, స్పోర్ట్స్ : మరో వారం రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం జరుగనున్న నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఏడాది చైనాతో ఉన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన మొబైల్ కంపెనీ వీవోను బీసీసీఐ తాత్కాలికంగా పక్కన పెట్టింది. వీవో స్థానంలో ఫాంటసీ లీగ్ సంస్థ డ్రీమ్ 11కు రూ. 220 కోట్లకు స్పాన్సర్‌షిప్ హక్కులు కట్టబెట్టింది. వీవో సంస్థ ఏడాదికి రూ. 440 కోట్ల వరకు ఇస్తుండగా.. చైనా ఉద్రిక్తలు, కరోనా మహమ్మారి నేపథ్యంలో దానిలో సగం ధరకే డ్రీమ్ 11 స్పాన్సర్ హక్కులు చేజిక్కించుకుంది. అయితే ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసిపోయింది. దీంతో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్ స్పాన్సర్ ఎవరనే దానిపై సందిగ్ధత నెలకొన్నది.

తప్పుకున్న వీవో..

గత ఏడాది నాటి పరిస్థితులే ఇప్పటికీ కొనసాగుతుండటంతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రేసు నుంచి పూర్తిగా తప్పుకోవాలని వీవో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బీసీసీఐ, వీవో మధ్య 4 ఏళ్ల ఒప్పందం ఉన్నది. తొలి ఏడాది సజావుగా సాగినా, గత ఏడాది మాత్రం బీసీసీఐ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఇక వీవో దగ్గర 2021, 2022 సీజన్ల టైటిల్ హక్కులు ఉన్నాయి. బీసీసీఐ మాత్రం వీవోను కొనసాగించాలనే ఆలోచనలో ఉండగా.. వీవో మాత్రం ఐపీఎల్‌తో బంధాన్ని తెంచుకోవాలని భావిస్తున్నది.

ప్రస్తుతం చైనా, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితుల్లో ఐపీఎల్‌తో కొనసాగడం అంత లాభదాయకం కాదని వీవో యాజమాన్యం అనుకుంటున్నది. అంతే కాకుండా.. కరోనా నేపథ్యంలో వీవో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిన బ్రాండ్‌ను మరింత డబ్బు వెచ్చించి ప్రచారం చేయడం కూడా లాభదాయంక కాదని భావిస్తున్నది. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయమని వీవో అనుకుంటున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

తప్పుకున్నా బీసీసీఐకి లాభమే..

బీసీసీఐ-వీవో సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశం లేదు. గత ఏడాది బీసీసీఐ కూడా ఒప్పందాన్ని రద్దు చేయకుండా కేవలం సస్పెండ్ మాత్రమే చేసింది. ఈ ఏడాది పాత ఒప్పందాన్నే కొనసాగించాలని బీసీసీఐ భావించింది. కానీ వీవో మాత్రం అందుకు సుముఖంగా లేదు. ఏక పక్షంగా ఒప్పందాన్ని వీవో రద్దు చేసుకోలేదు. అందుకే ఇతర సంస్థలకు దాన్ని బదిలీ చేయాలని అనుకుంటున్నది. ఇప్పటికే డ్రీమ్ 11, అన్అకాడెమీ వంటి సంస్థలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ ఒప్పంద బదిలీ జరిగితే పాత ధరకు కాస్త అదనంగా బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 440 కోట్ల కంటే కాస్త ఎక్కువగా బీసీసీఐకి ఆదాయం రానున్నది. మరో వారం రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం ప్రారంభం కానున్న నేపథ్యంలో వీవో తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed