వైరస్ మ్యుటేట్ ముప్పు..హెచ్చరించిన ప్రధాని మోడీ

by Shamantha N |   ( Updated:2021-06-18 06:46:25.0  )
Prime Minister Modi to attend G7 summit
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇంకా ఖతం కాలేదని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని థర్డ్ వేవ్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా హెచ్చరించారు. మన మధ్య వైరస్ ఇంకా ఉన్నదని, అది మరిన్ని సార్లు మ్యుటేట్ అయ్యే ముప్పూ ఉన్నదని అన్నారు. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ సద్దుమణుగుతున్నదని, గతంలో తెలియని వైరస్ లక్షణాలు, స్వభావాలు తెలిసివచ్చాయని వివరించారు. కాబట్టి, ముందు ముందు వైరస్ విసిరే సవాళ్లకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

కొవిడ్ ప్రొటోకాల్, మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి ముందుజాగ్రత్తలను తప్పకుండా పాటించాలని మరోమారు కోరారు. భవిష్యత్‌లో వైరస్‌ను ఎదుర్కోవడంలో హెల్త్‌కేర్ వర్కర్లు, వైద్యులకు సహాయంగా ఉండటానికి లక్ష మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లను సిద్ధం చేయాలని నిర్ణయించామని ఓ వర్చువల్ మీట్‌లో వెల్లడించారు. ప్రస్తుత వైద్యారోగ్య వ్యవస్థలో సహాయకారులుగా ఉపయోగపడి భారాన్ని తగ్గించడానికి వీరు దోహదపడతారని వివరించారు.

రాష్ట్రాల్లో ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిపుణులు క్రాష్ కోర్సులు రూపొందించారని, వీటిని 26 రాష్ట్రాల్లో 111 శిక్షణ కేంద్రాల్లో అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. రెండు, మూడు నెలల వ్యవధితో క్రాష్ కోర్సులుంటాయని, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనా 3.0 కింద వీటిని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. మొత్తం ఆరు జాబ్ రోల్స్ ఉంటాయని, అవి హోమ్ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడికల్ ఎక్విప్‌మెంట్ సపోర్ట్ అని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది. 18ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఉచితంగా వేస్తామని పునరుద్ఘాటించారు. జూన్ 21 నుంచి దీన్ని అమలు చేస్తామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed